స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సుప్రీం కోర్టులో తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం భిన్నమైన తీర్పు వెలువడింది. టీడీపీ వర్గాలు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించగా వారికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏను ఈ కేసులో చంద్రబాబుకు అన్వయించే విషయంలో తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ప్రకటించారు. తగిన నిర్ణయం తీసుకోవడం కోసం కేసును ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నామని వారు చెప్పారు. తనపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్న దరఖాస్తును గత సంవత్సరం సెప్టెంబర్‌లో హైకోర్టు కొట్టేయడంతో బాబు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు.
కేసు ఏంటి?
స్కిల్ డెవలప్మెంట్ స్కాం. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా దాని పేరుతో చంద్రబాబు బృందం ఓ ప్రాజెక్టును సృష్టించి రూ.241 కోట్లు కొట్టేసింది. ఈ కేసుపై ఈడీ కొరడా ఝుళిపించింది. షెల్ కంపెనీల ప్రతినిధులను అరెస్ట్ చేయడంతోపాటు డిజైన్ టెక్ అనే కంపెనీ బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసింది. ఇక సిట్ షెల్ కంపెనీ ప్రతినిధులు, అప్పటి అధికారులను అరెస్ట్ చేసింది. గతేడాది సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 50 రోజులకు పైగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. తొలుత అనారోగ్య కారణాలను సాకుగా చూపించి హైకోర్టు నుంచి మధ్యంత బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది.
వరిస్తుందన్న న్యాయమూర్తులు
కాగా ఈ కేసులో తాజాగా ఇద్దరు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. 17ఏ వర్తించినంత మాత్రాన గవర్నర్ అనుమతి తీసుకోలేదనే సాకుతో కేసును కొట్టేయలేం. ట్రయల్ కోర్టు విధించిన రిమాండ్‌ని తప్పుపట్టలేం. కేసును క్వాష్ చేయడం కుదరదని, ప్రభుత్వం ఇప్పుడైనాగవర్నర్ అనుమతి తీసుకోవచ్చని జస్టిస్ బోస్ అన్నారు. ఇక రెండో జస్టిస్ త్రివేది మాట్లాడుతూ 17ఏ కూడా వర్తించదు కాబట్టి కేసు యధాతథంగా కొనసాగుతుందన్నారు. స్థూలంగా ఇద్దరూ చెప్పింది ఒకటే. కేసును తప్పు పట్టలేం. రిమాండ్ విధించడం సబబే. అందులో జోక్యం చేసుకోము. బాబు కోరుకున్నట్లు క్వాష్ చేయలేం. దర్యాప్తును ఆపలేం. కొనసాగించవచ్చు.