రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం వార్షిక బడ్జెట్ రూ.2.86 లక్షల కోట్లు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2.30 లక్షల కోట్లుగా చూపించారు. మూల ధన వ్యయం విషయానికొస్తే రూ.30,530 కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు రూ.24,758 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు రూ.1.56 శాతం, జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.51 శాతంగా బుగ్గన వెల్లడించారు.
ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఓటాన్ బడ్జెట్‌ను ఆమోదించారు. నంద్యాల జిల్లా డోన్‌లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇంకా డోన్‌లోనే వ్యవసాయ రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016కు సవరణలు చేసి బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో మూడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచారయ్య యూనివర్సిటీ, రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్, కాకినాడ జిల్లా సూరంపాళెంలో ఆదిత్య యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం లభించింది.