తెలంగాణలోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పలు ముఖ్యమైన ఔషధాలకు కొరత ఏర్పడింది. సాధారణంగా వినియోగించే యాంటీ బయాటిక్స్, యాంటీ ఫంగల్, నొప్పుల నివారణ మాత్రలు, కళ్ల ఇన్ఫెక్షన్ను తగ్గించే చుక్కల మందు, కాలిన గాయాలపై పూసే క్రీము, ప్రమాదాల్లో గాయాలైనప్పుడు కుట్లు వేయడానికి ఉపయోగించే దారం, గాయాలకు కట్టుకట్టే ప్లాస్టర్లకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గత 10 నెలలుగా ఔషధ సరఫరాదారులకు చెల్లించాల్సిన సుమారు రూ.125 కోట్లకు పైగా బకాయిలు చెల్లింపునకు నోచుకోకపోవడంతో వారు గత 4 నెలలుగా సరఫరాను పూర్తిగా నిలిపివేసినట్టు సమాచారం. ఇది సాక్షాత్తు ఈనాడు వెబ్సైట్లో కనిపించిన వార్త. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైద్యశాలల రూపురేఖలు మారిపోయాయి. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కార్పొరేట్ వైద్యం అందేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారు. దీంతో పీహెచ్సీలో ఓపీ సంఖ్య క్రమేణా పెరిగింది. రోగులకు అవసరమైన మందులు సిద్ధంగా ఉన్నాయి. రూ.16 వేల కోట్లతో ఆస్పత్రుల ఆధునికీకరణ జరిగింది. కొత్తగా 304 పీహెచ్‌సీలు పెట్టారు. ప్రభుత్వం 53 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసి సిబ్బంది కొరత తీర్చింది. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.
గతంలో మాదిరి రోగులు మెరుగైన వైద్యం, పరీక్షల కోసం పట్టణాలు, నగరాల్లోని ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లేవారు. నేడు స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రంలోనే పొందే విధంగా ప్రభుత్వం వసతులు కల్పించింది. వైద్యశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చడంతో పాటు, తగినంత మంది వైద్య సిబ్బందిని నియమించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులను నియమించారు. చాలా కేంద్రాల్లో కూడా 24 గంటల వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు రూ.లక్షల విలువ చేసే పరికరాలు ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. గతంలో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలంటే బయపడే రోగులు జగనన్న ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి మెరుగైన వైద్యసేవలు అందిస్తుండడంతో ధైర్యంగా వైద్య సేవల కోసం ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఆరోగ్య కేంద్రంలో నాడు-నేడు పథకం ద్వారా లక్షల రూపాయల విలువ చేసే పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ప్రతి పీహెచ్సీలో కుక్కకాటు, పాము, తేలుకాటు ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు అవసరమైన బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ తదితర వ్యాధులకు సంబంధించిన 160 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ప్రతి నెలా 9వ తేదీన గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేసి, రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తించి ఐరన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పులు ప్రోత్సహిస్తున్నారు.
గత ప్రభుత్వ పాలనలో ఒక్కో పీహెచ్సీలో ఒక్కో విధంగా సిబ్బంది ఉండేవారు. ఒక చోట ఐదుగురుంటే మరో చోట 15 నుంచి 20 మంది వరకు ఉండేవారు. ఫలితంగా వైద్య సేవలు గందరగోళంగా అందేవి. అత్యవసర సమయాల్లో రోగులు ఇబ్బందులు పడేవారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రస్తుతం ప్రతి పీహెచ్సీలో 14 మంది సిబ్బంది విధులు నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకుంది. ఫలితంగా రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజా వైద్య రంగంలో పెనుమార్పులు వచ్చాయి. గ్రామీణ పీహెచ్‌సీల పనితీరు అద్భుతమని గతంలో కేంద్రమే కొనియాడింది. నూటికి నూరు శాతం కేంద్రాల్లో 24 గంటలపాటు సేవలు అందుతున్నాయి. గణాంకాల ప్రకారం 1,142 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్విరామంగా వైద్యం అందుబాటులో ఉంది. దేశంలో 45.1 శాతం కేంద్రాల్లో మాత్రమే 24 గంటలు సేవలు అందిస్తున్నారు. సేవల విషయంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
ఇంకా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను అనుసంధానం చేసింది. వీటికి విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ క్లినిక్స్ పేరు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పున విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి సుమారు 11,480 ఉన్నట్లు అంచనా. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌తోపాటు ఏఎన్ఎం, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచింది. ఈ క్లినిక్‌లలో 14 రకాల పరీక్షలు చేయడంతోపాటు 105 రకాల మందులు అందించేలా ఏర్పాట్లు చేసింది.