పేద వాడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణఅన్నారు. మా మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని తమ పార్టీ భావిస్తుంది అని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులాగా వారి మేనిఫెస్టో పేరుతో తాము దగా చేయమన్నారు. విద్యా, వైద్యం, రాష్ట్ర అభివృద్ధి , వ్యవసాయంపై ఈ ఐదేళ్లు ఫోకస్ పెట్టామని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లు వాటిపై మరింత దృష్టి పెడతామన్నారు. మేనిఫెస్టోలో ఉన్న 99 శాతం హామీలను నెరవేర్చిన ఏకైక పార్టీ వైసీపీనే అని తెలిపారు. దేశ రాజకీయాల్లో ఏ పార్టీ ఇంత పెద్ద మొత్తంలో మేనిఫెస్టోని అమలు చేయలేదన్నారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని విరుచుకుపడ్డారు. మా నాయకుడు 2019 మేనిఫెస్టో ను , ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టో పక్కన పెట్టి వివరించారు. చంద్రబాబుకు 2014 మేనిఫెస్టో పెట్టి మా ప్రభుత్వం ఫలానా చేసాం అనే చెప్పే ధైర్యం ఉందా అని అడిగారు.
చంద్రబాబు నాయుడు గతంలో డ్వాక్రా మహిళలకు పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడిగారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ రాజధాని అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారని వివరించారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేది సీఎం జగన్ కల అని తెలిపారు. 25 వేల రూపాయలు లోపు జీతం ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నవరత్నాలు అందించడం శుభపరిణామమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.