ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం సృష్టించింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న బీజేపీ తాజాగా సూరత్ లోక్‌సభ స్థానం కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు గుజరాత్ బీజేపీ ఎక్స్ ట్విట్టర్లో ప్రకటించింది.
వాస్తవానికి సూరత్‌లో మే 7న ఎన్నికల పోలింగ్ జరగనుంది. కానీ నామినేషన్ల పరిశీలనలోనే కాంగ్రెస్ అభ్యర్థిపై అనర్హత వేటు పడింది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలను సంతకాలు సరిగ్గా లేవని ఆదివారం జిల్లా రిటర్నింగ్ అధికారి సౌరభ్ పర్ఘీ తిరస్కరించారు. మరోవైపు సూరత్ నుంచి కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఉన్న సురేష్ పడసాల నామినేషన్ ఫారం కూడా తిరస్కరణకు గురి కావడం గమనార్హం. ఈ క్రమంలో స్వతంత్రులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు సూరత్‌లో ముకేశ్ దలాల్ ఎన్నికను ఏకగ్రీవం కావడంతో ఈ స్థానం మినహాయించి మిగిలిన స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఉద్దేశపూర్వకంగానే తమ నామినేషన్లకు రిటర్నింగ్ అధికారి తిరస్కరించారని మండిపడుతోంది. ఈ వ్యవహారంపై హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధపడుతున్నట్లు సమాచారం.