ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ వర్సెస్ ఎన్డీయే కూటమి మధ్య మాటల యుద్దం సాగుతోంది. అదే సమయంలో ఎన్డీయే కూటమిని వైసీపీకి ధీటుగా తయారుచేసేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలపైనా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిదంటూ టీడీపీ నేతలు కూడా అక్కడక్కడా వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీతో పొత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలను ఆ పార్టీ కైకలూరు అభ్యర్ధి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇవాళ మరోసారి గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు కేసులు దృష్ట్యా బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు రాష్ట్రంలోని ప్రజలు అనుకుంటున్నారని కామినేని శ్రీనివాస్ అన్నారు. పవన్ వల్లే తాను కైకలూరులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు కామినేని తెలిపారు. ఆయనే బీజేపీని టీడీపీతో కలిపారని గుర్తుచేశారు. ఆయన తగ్గి మరీ ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేశారన్నారు. సీట్లు ఎన్నో కూడా అడక్కుండా కూటమిలో పార్టీల్ని కలిపారన్నారు.
కూటమిలోకి బిజెపి టిడిపిలను కలిపిన పవన్ కళ్యాణ్ ఎందుకు తక్కువ సీట్లు తీసుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. జనసేనలో బలమైన అభ్యర్థిత్వం ఉన్న చోటు కూడా పార్టీ కష్టపడిన నాయకుల్ని కాదని టిడిపి నుంచి చేరిన వారికి లేదా ఆ సీట్ ని కూటమి పొత్తుల భాగంగా ఇతర పార్టీ వాళ్లకి కేటాయించడంతో జనసేన కార్యకర్తలు నెవ్వారిపోయారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభావం ఏ మాత్రం ఉంటుందో చూడాలి.