తన పార్టీని, పార్టీ నిర్మాణాన్ని కూడా పక్కన పెట్టి అష్ట కష్టాలు పడి బిజెపితో పవన్ కళ్యాణ్ టిడిపికి పొడిపించిన పొత్తు ఆదిలోనే హంసపాదయ్యేట్టుంది. ఎందుకంటే చంద్రబాబు పూర్వ చరిత్ర తెలిసిన ఎవరైనా ఒక పట్టాన బాబును నమ్మాలంటే కాస్త ఆలోచనలో పడతారు. పొరపాటున అడుగులు ముందుకేసి కలిసి నడుస్తున్నా అడుగడుక్కి అనుమానంతోనే బ్రతుకుతారు. కారణం పాము విషాన్నే కక్కుతుంది తప్ప పాలను కాదు, పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదని… వెన్నుపోటు నాయుడు ఎప్పుడూ నమ్మించి గొంతు కోస్తాడు అని పొలిటికల్ సర్కిల్స్ లో ఎప్పుడూ చక్కర్లు కొట్టే మాటే….
అయితే అది ఇప్పుడు బిజెపి పెద్దలకు బాగా అర్థమైనట్టుంది. నిజానికి బాబుతో స్నేహంలో బిజెపి ఎప్పటికప్పుడు మోసపోతూనే ఉంది. పొత్తు కోసం వెంపర్లాడేదాకా కాళ్లు, పొత్తు కుదిరాక జుట్టు పట్టుకునే నైజం బాబుది అని తెలిసి కూడా బిజెపి ఎందుకు పొత్తు పెట్టుకుంటుందో ఎవరికి అర్థం కాని ప్రశ్న గానే మిగిలిపోతుంది. గత అనుభవాలు ఎప్పటికప్పుడు గుణపాఠాలు నేర్పుతున్న బిజెపి పెద్దలు బాబు మాయలో ఎలా పడతారో ఎందుకు పడతారో అర్థం కాదు. గతంలో ఇదే చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకుని, ఘోర ఓటమి అనంతరం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోదీని వ్యక్తిగతంగా విమర్శలు చేసిన సందర్భం మనకు తెలిసిందే.. అన్నీ తెలిసి కూడా బిజెపి పెద్దలు చంద్రబాబుతో పొత్తుకు ఎందుకు మొగ్గు చూపుతున్నారో మరి.. బహుశా బాబు అవసరం బిజెపి పెద్దల అవకాశం కావచ్చు. ఆ పరిస్థితి ఈరోజు ఈ దుస్థితికి కారణం అయ్యి ఉండొచ్చు.
సరిగ్గా దీన్నే అవకాశం గా తీసుకున్న బాబు తన వదిన , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ద్వారా రాష్ట్ర బీజేపీ ని గుప్పట్లో పెట్టుకోవడానికి పావులు కదిపాడు. ఆది నుంచి బీజేపీ నాయకత్వపు అడుగుల్లో నడుస్తున్న సోము వీర్రాజు పీవీఎన్ మాధవ్.. విష్ణు వర్ధన్ రెడ్డి లాంటి నిజమయిన బీజేపీ నేతలకు సీట్లు చించేసి, ఒక్క కాపు బ్రాహ్మణ వైశ్య కు కూడా టిక్కెట్ లేకుండా చేసి తన సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఇప్పించుకున్నాడు. వీళ్లంతా బాబు ఆదేశానుసారం బిజెపిలోకి చేరినవారే కావడం గమనార్హం. బాబు పంపితేనే బిజెపిలో చేరిన సుజనా చౌదరి సీఎం రమేష్ బిజెపితో పొత్తులో కూడా టికెట్లు ఇప్పించుకోవటం ఒక రకంగా బాబు చాతుర్యమనే చెప్పాలి..
దీనితో ఆలస్యంగా మేల్కొన్న కేంద్ర బిజెపి పెద్దలు, పురందేశ్వరి ద్వారా చంద్రబాబు ఈ కపట నాటకానికి తెర తీశాడు అని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇకనైనా మేలుకోకపోతే మునుపటి అనుభవాలు పునరావృతం అవుతాయి అని ఒక అంచనాకు వచ్చినట్టున్నారు. అందుకే ఇక బాబుతో అంటకాగింది చాలు.. కూటమి తరఫున ఇంకో ఉమ్మడి సభ వద్దంటే వద్దు.. అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు రాష్ట్ర బిజెపి నాయకులు చెబుతున్నారు. ఒకవేళ తప్పనిసరి సభలు పెట్టాల్సి వచ్చిన పరిస్థితులలో ఆ సభలకు మోదీ, అమిత్ షా వచ్చినా చంద్రబాబుతో సంబంధం లేకుండా కేవలం బీజేపీ నాయకులు కార్యకర్తలతో మాత్రమే సభలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.