2024 సార్వత్రిక ఎన్నికలకు పది రోజులు కూడా సమయం లేదు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బిజెపి టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి జనసేన పార్టీలు ప్రజాగళం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమిలో మాత్రం మూడు పార్టీలు ఉన్నాయి, మేనిఫెస్టోలో మాత్రం రెండు పార్టీలు కలిపి విడుదల చేశాయి. విడుదల చేసిన మేనిఫెస్టోకి బిజెపికి సంబంధం లేదు అన్నట్లు బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారు. మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేంద్ర బీజేపీ నేత సిద్ధార్థ సింగ్ హాజరైన మేనిఫెస్టో పట్టుకోడానికి కూడా సముఖత చూపలేదు. అటు కేంద్ర బిజెపి నేతలు గాని ఇటు రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు గాని మేనిఫెస్టోను సమర్థించడం లేదు. అందుకు కారణం 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు అలివిగాని హామీలు ఇచ్చి మోడీకి చెడ్డపేరు తెచ్చాడని కారణంగా ఆ నేతలు మీడియా ముఖంగా చెబుతున్నారు.
ఇప్పుడు తాజాగా బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టిడిపి జనసేన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు మాకు సంబంధం లేదంటూ బహిరంగంగానే ప్రకటించాడు. 2014 ఎన్నికల్లో రైతులకు పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించిన చంద్రబాబు, ఇప్పుడు రైతులకు ఏడాదికి 20,000 ఇస్తామంటే నమ్మేదెట్లా అని మీడియా ముఖ్యంగా ప్రశ్నించారు. 80 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి చివరికి 14 వేల కోట్లు కూడా చేయలేకపోయి రైతు ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయాడని అన్నారు. ఆచరణకి సాధ్యమయ్యే హామీల, బిజెపి పాలసీలకు తగ్గ హామీలకు మాత్రమే మా హామీ ఉంటుంది అని తెలిపారు. హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర బడ్జెట్ ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
గతంలో 2014లో ఇచ్చిన మేనిఫెస్టోని డిలీట్ చేసిన టిడిపి వారు ఈ మేనిఫెస్టోని ఏమాత్రం అందుబాటులో ఉంచుతారన్న గ్యారెంటీ ఏంటి అని అడిగారు. ఇప్పుడు ప్రకటించిన పథకాలకు నిధులు ఎలా సేకరిస్తారు అనే విషయాన్ని స్పష్టం చేయాలని కూడా అడిగారు. బిజెపి నేత ఐ వై ఆర్ కృష్ణారావు కూడా ఈ మేనిఫెస్టో అమలు అసాధ్యమని ఇప్పటికే పలు మీడియా వేదికలుగా ప్రకటించాడు. ఇలా ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా కూటమి నేతల్లోనే మేనిఫెస్టోకి సంబంధించి మద్దతు టిడిపికి దొరక్కపోయేసరికి ఏం చేయాలో తెలియని స్థితిలో టిడిపి జనసేన నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.