‘ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కంటే నేనే సీనియర్ లీడర్. విజనరీని. సెల్‌ఫోన్, కంప్యూటర్ సృష్టికర్తని. నిప్పుని. గాంధీజీ, అన్నాహజారే వారసుడ్ని.’ పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పిన మాటలివి. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయిన బాబు ప్రజలను మభ్య పెట్టేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. తన పదవీ కాలంలో నారా వారు యథేచ్ఛగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ బయట పడుతూ వచ్చారు. ఓటుకు కోట్లులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికనా నా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారే తప్పు చేయలేదని వెల్లడించని ఘనుడు చంద్రబాబు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఇన్నర్ రింగ్ భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అనేక కేసుల్లో ఇరుక్కుని.. వాటిల్లో బెయిల్ తెచ్చుకుని రాజకీయాలు చేస్తున్న ఏకైక వ్యక్తి దేశంలో బాబు ఒక్కరే కావొచ్చు.
నేడిలా..
చంద్రబాబు అవినీతికి పాల్పడతాడు. కానీ విచారణ జరగదు. జైలుకు వెళ్లడు. ఎలా తప్పించుకోవాలో ఆయనకు బాగా తెలుసని ప్రజల్లో, టీడీపీ నేతల్లో పేరుంది. కానీ ఈ ప్రభుత్వంలో ఆ పప్పులేవీ ఉడకలేదు. ప్రజల సొమ్మును దోచుకున్న అవినీతిపరులను ఉపేక్షించలేదు. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేసింది. ఇది గత సర్కార్ హయాంలోని, ప్రాజెక్టులు, కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలకు సంబంధించి తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను క్షుణ్ణంగా పరిశీలించింది. నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో మొత్తం వ్యవహారాలను దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశారు. దీంతో గతంలో స్టేలు తెచ్చుకుని బతికిపోయిన బాబు నేడు బెయిళ్లు తెచ్చుకుని తిరుగుతూ ప్రజలకు నీతి వాఖ్యాలు వల్లిస్తున్నాడు.
బాబుపై కేసులిలా..
–స్కిల్ డెవలప్మెంట్ స్కాం. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా దాని పేరుతో చంద్రబాబు బృందం ఓ ప్రాజెక్టును సృష్టించి రూ.241 కోట్లు కొట్టేసింది. ఈ కేసుపై ఈడీ కొరడా ఝుళిపించింది. షెల్ కంపెనీల ప్రతినిధులను అరెస్ట్ చేయడంతోపాటు డిజైన్ టెక్ అనే కంపెనీ బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసింది. ఇక సిట్ షెల్ కంపెనీ ప్రతినిధులు, అప్పటి అధికారులను అరెస్ట్ చేసింది. గతేడాది చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 50 రోజులకు పైగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. తొలుత అనారోగ్య కారణాలను సాకుగా చూపించి హైకోర్టు నుంచి మధ్యంత బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది.
– బాబు అండ్ కోపై ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఉంది. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి కుంభకోణం ఇది. ఇందులో బాబు అంతా తానై వ్యవహరించారు. ఏ–1గా ఉన్నారు. ఈ కేసులోనే మాజీ మంత్రి నారాయణ కూడా ఉన్నారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని సంస్థలకు చెందిన భూముల సమీపం నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లేలా అలైన్మెంట్ రూపొందించి మూడుసార్లు మార్పులు చేశారు. కరకట్ట కట్టడం క్విడ్‌ప్రోకో కిందే బాబుకు లింగమనేని అప్పగించారని ఆరోపణలున్నాయి.
– ఇకపోతే ఇసుక కుంభకోణం. రాష్ట్ర విభజనకు ముందు రీచ్‌ల వారీగా వేలంపాటలు జరిగాయి. బాబు అధికారంలోకి వచ్చాక మార్పులు చేశారు. తొలుత డ్వాక్రా సంఘాలకు రీచ్‌లు ఇస్తున్నామని ప్రకటించారు. మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే. ఉచిత ఇసుక పాలసీ విషయంలో బాబు తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ ఖాజానాకు భారీగా నష్టం వాట్లిందని నమోదైన ఈ కేసులో ఆయన ఏ–3గా ఉన్నారు.
– మరొకటి మద్యం కేసు. ఇష్టారాజ్యంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు. బాబు నిర్ణయాలతో ఖజానాకు నష్టం వాటిల్లింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారని బాబు, అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ కమిషనర్ శ్రీ నరేష్‌పై కేసు నమోదైంది. బుధవారం ఈ మూడు కేసుల్లో హైకోర్టు నుంచి బాబు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
– అంగళ్లు కేసు.. యుద్ధభేరి పేరుతో ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి. ఈ కేసులో బాబు ఏ–1. ఇందులోనూ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. – ఫైబర్ నెట్ స్కాం.. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ఈ స్కాంలో టెరా సాఫ్ట్ కంపెనీ కీలకంగా ఉంది. ఈ కేసులోనూ చంద్రబాబుæ ఉన్నారు.
ఇలా అనేక కేసుల్లో ఉన్న వ్యక్తి తెలుగుదేశం అధినేత చంద్రబాబు. అనారోగ్యం పేరుతో బెయిల్‌పై వచ్చి రాజకీయాలు చేయడం ప్రారంభించారు. బాబు ఏనాడూ తప్పు చేయలేదని చెప్పలేదు. ఎంత సేపటికీ నేను విజనరీ, హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా.. నాపైనే కేసులు పెడతారా అంటూ వాదిస్తున్నారు. ఎవర్నీ వదలను, అందరి అంతు చూస్తా.. అంటూ బెదిరింపులకు దిగిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో కోర్టు నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఈయన స్కిల్డ్ దొంగ అని అందరికీ తెలిసినా టీడీపీ నాయకులు, దత్తపుత్రుడు పవన్, ఇతర పార్టీలోని ఆయన అనుకూల వర్గం, మేధావి ముసుగులో భజన చేసేవారు కూడా బాబు తప్పు చేయలేదని మాత్రం చెప్పరు. ఆయన సీనియర్ పొలిటీషియన్, సాఫ్ట్వేర్ సృష్టికర్త. ఈ వయసులో అరెస్ట్ చేస్తారా?, అరెస్ట్ చేసిన విధానం బాగోలేదంటూ ఏవో కథలు చెబుతుంటారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఊరూరా తిరుగుతూ నాకు ఓటు వేయండి.. మీ భవిష్యత్‌కు నాది బాధ్యతని బాబు ఊదరగొడుతున్నారు. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
ఏ స్కాంలో ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలీదు. ఏ కేసులో ఎప్పుడు బెయిల్ కేన్సిల్ అవుతుందో చెప్పలేం. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోవాలని ఆశ పడుతున్నాడు. బాబుకు తన భవిష్యత్ ఏంటో తెలీదు. ఆయన మీ భవిష్యత్‌ను బంగారుమయం చేస్తానని చెబుతుండటాన్ని విని ప్రజలు నవ్వుకుంటున్నారు.