జనసేన నాశనమే బాబు లక్ష్యం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని నానా తంటాలు పడుతున్నారు. ఇందుకోసం తాను తలొగ్గడమే కాకుండా జనసైనికులను అలాగే ఉండాలని చెప్పారు. కానీ టీడీపీ అండ్ కో అలా అనుకోవడం లేదు. ఏ కాడికి సేనను వాడుకుని కాపు ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. అదే సమయంలో పవన్ పార్టీని నామరూపాల్లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయం పవన్‌కు అర్థమైనా బాబు కబంధహస్తాల్లో నుంచి బయటికి రాడు.
ఎన్నికలు సమీపిస్తున్నా ఇంత వరకు చంద్రబాబు సీట్ల విషయం తేల్చలేదు. బీజేపీతో పొత్తు కోసమంటూ ఆపుతున్నాడు. జనసైనికులు తమకు ఎక్కువ సీట్లు కావాలని అడుగుతున్నా ఇచ్చే సూచనలు కనిపించడంలేదు. పవన్ కూడా బాబుకు పూర్తిగా లొంగిపోయి కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. నిజానికి జనసేన ఎంతోకొంత బలం ఉందంటే అది ఉభయ గోదావరి జిల్లాల్లోనే. సామాజిక వర్గం నేపథ్యంలో అక్కడ పవన్‌ను ఇష్టపడే యువత ఉంది. ఆ జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో పవన్‌కు కేవలం ఏడు లేదా ఎనిమిది మాత్రమే ఇవ్వాలని టీడీపీ అధిష్టానం చూస్తోంది. ఎక్కువ సీట్లు ఇస్తే బలపడే ప్రమాదం ఉందని బాబు ఈ ఆలోచన చేశారు.
సేన నేతలు మాత్రం ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు ఇవ్వాలని అడుగుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట సీట్లను పొత్తులో భాగంగా తీసుకుంటే మంచిదని పవన్‌కు నాయకులు సూచిస్తున్నారు. అయితే ఆ పరిస్థితి లేదు. రెండు జిల్లాల్లో అతి తక్కువ స్థానాలకే పరిమితం చేయాలని టీడీపీ పెద్దల ఆలోచన.
ఇలా కూడా చేసే అవకాశం
అసలు బాబు జనసేనకు 25 సీట్ల లోపే ఇవ్వాలని చూస్తున్నారు. అందులో కూడా పదిచోట్ల టీడీపీ నేతలను సేనలోకి పంపి పోటీ చేయించాలని భావిస్తున్నారు. మావాళ్లు మాట వినడం లేదని చెప్పి5 నుంచి 6 చోట్ల టీడీపీ రెబల్ అబ్యర్థులను పోటీకి దింపి జనసేన దెబ్బకొట్టే ప్రయత్నం చేసే అవకాశముంది. ఇంకా సేన పోటీ చేసే సీట్లలోనూ టీడీపీ ఓట్లు పడకుండా ఆ అభ్యర్థులను ఓడించాలని పన్నాగం పన్నారు. మొత్తంగా పవన్ వల్ల కాపు ఓట్లు టీడీపీకి పడి లబ్ధి పొందాలి. కానీ జనసేన మాత్రం బలపడకూడదు. అందుకే బాబు రకరకాల వేషాలు వేస్తున్నారు.
జోగయ్య అడుగుతున్నవి..
మరోవైపు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య పవన్‌కు మరో లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం మెండుగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కువ సీట్లు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. దీని వల్ల ఓట్ల ట్రాన్స్ఫర్ జరుగుతుందని వెల్లడిస్తున్నారు. ఈయన లెక్క ప్రకారం పవన్ పార్టీ ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, ఉండి, నిడదవోలు, పార్లమెంట్‌కు సంబంధించి నర్సాపురం సీట్లు తీసుకోవాలి. వీటిని జనసేన దక్కించుకోలేకపోతే తెలుగుదేశం నష్టపోతుందని చెప్పారు. కానీ జోగయ్య అనుకున్నట్లు సేనకు సీట్లు ఇవ్వరు. ఆయన చాలా లేఖలు రాసినా జనసేనాని ఏనాడూ పరిగణలోకి తీసుకోలేదు. రెండు జిల్లాల్లో ఏడెమినిది స్థానాలకే పరిమితం చేయాలని చంద్రబాబు చూస్తుంటే జోగయ్య ఒకే జిల్లాలో 11 సీట్లు కోరడం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ అధినేతకు తెలిసింది ఒకటే. ఎవరినైనా సరే కరివేపాకులా వాడుకుని.. ఆ తర్వాత వదిలేయడం. వెన్నుపోటు పొడవడంలో దిట్ట ఆయన. చరిత్ర చూసుకుంటే చాలా విషయాలు కనిపిస్తాయి. ప్రస్తుతం సేన విషయంలో అదే జరుగుతోంది. నాకు ప్యాకేజీ ఇస్తే చాలు.. సేన ఏమైపోయినా ఫర్వాలేదనే ధోరణలో పవన్ ఉన్నారు. వారి దృష్టిలో జనసైనికులు గొర్రెలు. టీడీపీ మాట వింటే జనసేన దుకాణం త్వరలోనే మూతపడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.