వినేవాడు ఉండాలే కానీ.. చంద్రబాబు ఏమైనా చెప్తాడు. ప్రతి సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అలవాటు ఈయన ఎక్కడ నేర్చుకున్నాడోనని చాలామంది రాజకీయ నాయకులకు అనుమానం వస్తూ ఉంటుంది. అయితే బాబు మాత్రం ఆ కిటుకు చెప్పడు. తెలుగు తమ్ముళ్లు దీనికి చాణక్యం అని పేరు పెట్టినా.. అసలైన నామం జిత్తులమారి నక్క తెలివి. పాలిటిక్స్‌లో శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత మిత్రులు ఉండరు. ఈ విషయాన్ని బాబు సీరియస్‌గా తీసుకున్నట్లు ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో స్నేహం విషయంలో అలాగే ప్రవర్తిస్తున్నారు. ఒకసారి కలుస్తాడు. తనకు నచ్చనప్పుడు తిట్టి వదిలేస్తాడు. ఇది రిపీట్ మోడ్‌లో జరుగుతూ ఉంటుంది.
2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చంకనెక్కి బాబు చెప్పిన మాట ‘దేశం కోసం స్నేహం.’ 2024 ఎలక్షన్లు వచ్చే సరికి ఇది రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోందిగా మారిపోయింది. కాకపోతే ఈసారి బీజేపీ చంకనెక్కాడంతే.. నాడు బాబు రాహుల్ గాంధీని కలిస్తే కీలక ఘట్టం ఆవిష్కృతం రాసి ఎల్లో మీడియా ప్రచురించింది. దీనిని నాయకులు ప్రజాస్వామ్య అనివార్యతగా అభివర్ణించారంట. మోదీకి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రత్యామ్నాయ వేదికకు బాబు దిశానిర్దేశం చేస్తారు. ఇలా రాసుకుంటూ పోయారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. ఇదే ఎల్లో మీడియా బాబు, అమిత్‌షాల తాజాగా భేటీపై విపరీతమైన రంగులు అద్దాయి. జగన్ పాలనలో అభివృద్ధి లేదు. మళ్లీ పట్టాలెక్కాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి. పైగా రాజధాని కట్టాలి. పోలవరం పూర్తి చేయాలి. మోదీ మళ్లీ గెలవడం ఖాయం. అసలు వాళ్లే మనల్ని పిలుస్తున్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మైనార్టీల నిరసన గురించి చెప్పి పరిమితులు తెలియజేశా. ఇలా షాతో జరిగిన చర్చలను నేతలకు బాబు వివరించారట. బాబు మాటలు తలుచుకుంటే మైండ్ పోతోంది కదా.. ఆయనంతే ఎవరి ఊహలకు అందరు.
2019లో ప్రధాని పదవికి కూసింత దూరంలోనే ఉన్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు. చివరికి నడి సంద్రంలో మునిగిన నావలా పరిస్థితి అయిపోయింది. 2024లో ఏపీ సీఎం అయిపోనట్లు పార్టీ నేతలకు చెబుతున్నారు. ఈసారి జనం ఆయనకు ఏం స్క్రిప్ట్ రాశారో.. బాబు, ఎల్లో మీడియాలా అల్లే కథలు గొప్ప గొప్ప సినీ రచయితలు కూడా రాయలేరు.. వాస్తవానికి నాడు – నేడు అనేది ప్రస్తుతం ఏపీలో గొప్ప పథకం. అదే బాబు విషయంలో నాడు – నేడు చూస్తే ఎంతటి వారైనా మూర్ఛపోవడం ఖాయం.