సిక్కోలుకు నువ్వేం చేశావో చెప్పు బాబు అంటూ.. మంత్రి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు ఐదేళ్ళ పరిపాలనను ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీ పురం(సానివాడ) పంచాయతీలో రూ. 80 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్‌ను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం శ్రీకాకుళంకు ఏం చేసిందంటూ ప్రశ్నించారు. వైఎస్పార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిని సమపాళ్ళలో రంగరించి జిల్లా ప్రగతి చిత్రాన్ని తీర్చిదిద్దుతోందని చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో సిక్కోలుకు జరిగిన మేలు గురించి ఆయన మాటల్లోనే…
ఉద్దానానికి ఊపిరిలూదింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా నిలిచారు. పలాసలో రూ.50 కోట్లకు పైగా వ్యయంతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు. కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం పరిధిలో 7 (ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు) మండలాల్లోని 807గ్రామాలకు ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. సుమారు 5లక్షల 57వేల 633మందికి తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
వైసీపీ ప్రభుత్వం సిక్కోలు వలసలకు చరమగీతం పాడింది.. మత్స్యకారుల వలసలు ఆపేందుకు మత్స్యాకార భరోసా లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఉపాధిని మెరుగుపరిచేందుకు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. జలయజ్ఞంలో భాగంగా.. వంశధార ఫేజ్ 2లోని స్టేజ్ 2 పనులు పూర్తి చేశారు. నాగావళి, వంశధార నదుల అనుసంధానం పనులు పూర్తి చేస్తున్నారు. ఉద్దానంలోని మహేంద్ర తనయపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు కారణంగా ఈలోపు మొత్తం ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేశారు. మొత్తం సిక్కోలుకు.. ఇంటింటికి తాగునీరు సరఫరా చేసేందుకు జిల్లాలో మంచినీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పైపులెన్లు వేసింది.
నాడు నేడు హాస్పిటల్స్ అభివృద్ధిలో భాగంగా నరసన్నపేట ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. జిల్లా మొత్తంగా 83 ఆసుపత్రులను రూ.47 కోట్లతో అభివృద్ధి చేశారు. సచివాలయాల్లో భాగంగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా ఇంటి చెంతకే వైద్యసేవలు అందుతున్నాయి.
విద్యాభివృద్ధిలో భాగంగా.. ట్రిపుల్ ఐటీలో రూ.131కోట్లతో జీప్లస్–5 బ్లాక్‌లను మూడు నిర్మించింది. ప్రస్తుతం రూ.67కోట్లతో న్యూ అకాడమీ బ్లాక్‌ను ప్రస్తుతం నిర్మిస్తోంది. మరో రూ.133 కోట్లతో 6వేల మందికి సరిపడా వసతి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. జిల్లాకే తలమానికంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో రూ.45 కోట్లతో అదనపు భవనాలు నిర్మిస్తున్నారు.
పొందూరు, ఆమదాలవలస మండలం తొగరాంలో డిగ్రీ కళాశాలలు, పొందూరులో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్సియల్ బాలురు పాఠశాల, సరుబుజ్జిలి మండలం రొట్టవలసలో బాలికల జూనియర్ కళాశాల, వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నికల్ కళాశాల, ఆమదాలవలస మండలం తొగరాంలో అగ్రికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల, బూర్జ మండలం పెద్దపేటలో హార్టీకల్చర్ రీసెర్చ్ స్టేషన్ మంజూరు చేశారు.
జిల్లాలో నాడు–నేడు మొదటి ఫేజ్ కింద 1247 పాఠశాలలను, రెండో ఫేజ్ కింద పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, వసతి గృహాలు.. ఇలా 1096 విద్యాసంస్థలను తీర్చిదిద్దారు.
సిక్కోలు రైతులకు న్యాయం చేసేందుకు.. జిల్లాలో రైతుల కోసం 642 రైతుభరోసా కేంద్రాలు నిర్మించారు. 7 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ల నిర్మాణాలు చేపట్టారు. సాగుకు ఉపయోగపడేలా వైఎస్సార్ యంత్రసేవా పరికరాలు అందజేశారు. జిల్లాలో 10 వేల భూసార పరీక్షలు చేశారు. 27,049 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేశారు.
జిల్లాలో నాలుగేళ్లలో ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ.526. 69కోట్లతో 633.4 కిలోమీటర్లకు సంబంధించి 432 రోడ్లు మంజూరు చేసింది. శ్రీకాకుళం– ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్లకు రూ.43కోట్లు మంజూరు చేశారు.. పనులు ప్రారంభమయ్యాయి. రూ.28 కోట్లతో పొందూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. రూ. 48 కోట్లతో అలికాం– ఆమదాలవలస మధ్యలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.
ప్రసాదం స్కీమ్ కింద శ్రీముఖలింగం టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి చేస్తున్నారు. కోట్ల రూపాయలతో అరసవిల్లి సూర్యదేవాలయం అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాలో లక్షా 10వేల 825మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేశారు. వాటిలో మొదటి విడతగా 83,456 ఇళ్లు నిర్మాణాలు చేపడుతున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పని భాగంలో జిల్లాలో 27 ఫిష్ ఆంధ్ర డెలీయస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇలా వైఎస్సార్సీపీ ప్రబుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీకాకుళం జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది.
మీరేం చేశారో చెప్పగలవా చంద్రబాబు అంటూ సూటిగా ప్రశ్నించారు ధర్మాన.