రాష్ట్రాన్ని ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించి పరిశ్రమలు పెట్టేలా దిగ్గజ కంపెనీలను ప్రోత్సహించారు.
ఏపీలో ఇప్పటికే 300కు పైగా ఫార్మా కంపెనీలున్నాయి. రూ.41,500 కోట్ల ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్ గ్రడ్ పార్క్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రెండు వేల ఎకరాలను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. వంద పరిశ్రమలు ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. 27 వేలమందికి పైగా ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా కాకినాడ సమీపంలోని తొండంగి వద్ద 250 ఎకరాల్లో సుమారు రూ.2,205 కోట్లతో లిఫియస్ పేరుతో అరబిందో గ్రూపునకు చెందిన పెన్సులిన్ జి తయారీ యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని, ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైంది. చైనా నుంచి ఫార్మా దిగుమతులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) స్కీమ్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిని అరబిందో కంపెనీ సద్వినియోగం చేసుకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సహకారంతో యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది.
ఈ పెన్సులిన్ జి తయారీ కేంద్రంలో 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమవడంతో లిఫియస్ ఉద్యోగ నియామకాలు చేపట్టింది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ (బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ) కోర్సులు పూర్తి చేసిన వారిని వాక్ ఇన్ ఇంటర్వూ్య ద్వారా ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది. ఈనెల 22న హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న మనోహర్ హోటల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. ఫెర్మిటేషన్స్లో ప్రొడక్షన్, మైక్రోబయోలజీ రంగాల్లో నియామకాలకు తాజాగా కోర్సు పూర్తి చేసిన వారి (ఫ్రెషర్స్) దగ్గర నుంచి పది సంవత్సరాల అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పిస్తోంది. వాటర్ ట్రీట్మెంట్ అసిస్టెంట్ పోస్టులకు కనీసం రెండేళ్ల అనుభవం నుంచి పదేళ్ల వారికి అవకాశం ఇస్తారు.
మరో రెండు యూనిట్లు
లిఫియస్కు సమీపంలోనే పీఎల్ఐ స్కీమ్ కింద మరో రెండు ఫార్మా యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. అరబిందో గ్రూపు క్యూలే పేరుతో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో 159 ఎకరాల్లో ఎరిత్రోమైసిన్ థియోసేనేట్ యూనిట్‌ని పెడుతోంది. దీని ఉత్పత్తి సామర్థ్యం 1,600 టన్నులు. ఇంకా సమీపంలోనే దివీస్ సంస్థ ఓ ఫార్మా యూనిట్ ఏర్పాటు చేస్తోంది. దీని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూడు యూనిట్లతో కాకినాడ మేజర్ ఫార్మా హబ్‌గా ఎదుగుతోంది. జగన్ తీసుకున్న చర్యలతోనే ఇది సాధ్యమవుతోంది. ప్రపంచానికి మందులు అందించే శక్తిగా ఏపీగా రూపుదిద్దుకుంటోంది.
– వీకే..