ఆళ్ళగడ్డలో భూమా వర్సెస్ ఏవీల మధ్య కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. భూమా అఖిలప్రియా బాడీ గార్డ్ పై తీవ్ర స్థాయిలో దాడి జరిగింది. అయితే ఈ దాడి వెనుకాల ఏవీ సుబ్బారెడ్డి హస్తం ఉందని భూమా వర్గం ఆరోపిస్తుంది. భూమా నాగిరెడ్డి ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికి తెలిసిన విషయమే అయితే భూమా నాగిరెడ్డి మరణం తరువత అఖిలప్రియా వ్యవహార శైలితో సరిపడక ఏవీ సుబ్బారెడ్డి వీరికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినా అఖిల ప్రియా తన ఆధిపత్యం నిలుపుకోవడానికి అప్పుడప్పుడు ఏవీ వర్గంపైకి దాడులు దిగితూనే వస్తుందనే ఆరోపణలు ఆళ్లగడ్డలో వినిపిస్తున్నమాట .
నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా అఖిల ప్రియా వర్గం ఏవీపై కొత్తపల్లి రోడ్డులో దాడికి దిగింది. అఖిలప్రియ సమక్షంలోనే ఏవీపై నోటి నుండి రక్తం వచ్చేలా దాడి చేశారు. ఈ ఘటన నాడు ఆళ్ళగడ్డల్లో తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. ఈ దాడిలో అఖిల ప్రియా బాడీ గార్డ్ నిఖిల్ అనే యువకుడే ప్రధానంగా ఏవీపై దాడి చేసినట్టు అక్కడి వారు చెప్పిన మాట. అయితే ఇప్పుడు ఆళ్లగడ్డల్లో నాడు ఏవీపై దాడికి పాల్పడిన నిఖిల్ పైనే హత్యా యత్నం జరిగింది. ఈ దాడిలో నిఖిల్ తీవ్ర స్థాయిలో గాయపడినట్టు సమాచారం. ఆయనను హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచరం.
యువగళం పాదయాత్ర సందర్భంగా జరిగిన దాడి తరువాత చంద్రబాబు అఖిల, ఏవీలను పిలిచి ఎన్నికలు అయ్యేవరకు ఎలాంటి గొడవలు వద్దని హిత బోధ చేసినట్టు నాడు పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. అయితే చంద్రబాబు చెప్పిన విధంగానే ఏవీ ఎన్నికలు అయ్యేవరకు వేచి ఉండి ఎన్నికలు అయిన వెంటనే తనపై దాడి చేసిన నిఖల్ పై ఆయన వర్గాన్ని పంపి దాడికి దిగినట్టు అఖిల వర్గం ఆరోపిస్తుంది. ఆళ్ళగడ్డలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది.