జగన్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు తన అనుకూల మీడియాతో అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్న విషయం తెలిసిందే. సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుందంటూ ఎల్లో మీడియాలో అసత్య ప్రచారం చేయించిన చంద్రబాబు అనంతరం జగన్ ప్రభుత్వం కన్నా ఎక్కువ పథకాలు అమలు చేస్తానని హామీలిస్తుండడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వం తలకు మించిన అప్పులు చేస్తుందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు అన్న చందంగా అధికారం కోసం చంద్రబాబు ముఠా చేస్తున్న అసత్య ప్రచారాలకు అడ్డే లేకుండా పోతుంది.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023–24 లో వడ్డీల చెల్లింపులకు కేటాయించిన మొత్తం రూ.28,674 కోట్లు కాగా టీడీపీ హయాంలో చేసిన అప్పులకు కట్టాల్సింది మొత్తం వడ్డీ రూ.17,143 కోట్లు. జగన్ ప్రభుత్వం తీసుకున్న అప్పులకు చెల్లించిన వడ్డీ రూ.11,531 కోట్లు. చంద్రబాబు హయాంలో కన్నా ప్రస్తుత ప్రభుత్వం రూ. 5612 కోట్ల వడ్డీ తక్కువ కడుతుంది. కానీ దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా చేసిన అప్పులన్నీ చేసేసి అవన్నీ జగన్ ప్రభుత్వంపై నెట్టి వేయడం చంద్రబాబుకే చెల్లింది.
సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుందని అడ్డదిడ్డమైన డిబేట్లను తన అనుకూల ఛానెల్స్ లో ప్రచారం చేయించిన చంద్రబాబు, ఒక రాష్ట్రాన్ని దేశంతో పోల్చడం ఏంటనే ప్రశ్న ప్రజల్లో తలెత్తేసరికి మాట మార్చిన బాబు, జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకంటే ఎక్కువ పథకాలను అమలు చేస్తానని అమలుకు సాధ్యం కాని హామీలిచ్చారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఏపీ శ్రీలంక అయితే చంద్రబాబు అంతకు రెట్టింపు పథకాలను అమలు చేస్తే ఏపీ సింగపూర్ అవుతుందా అని అవాక్కవడం ప్రజలవంతయింది. అధికారం కోసం అబద్దపు హామీలు గుప్పిస్తూ, అసత్య ప్రచారాలకు తెగబడుతూ కుటుంబాలను చీలుస్తున్న ఎల్లో ముఠా ఆగడాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఇలా ప్రజలను మభ్యపెడుతున్న టీడీపీ ముఠాకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తుంది.