రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమాల్లో ఇది ఒకటి. దీని ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యానికి భరోసా కల్పించింది. గత సంవత్సరంలో సురక్ష తొలి విడత వైద్య శిబిరాలు జరిగాయి. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. రెండో విడత కార్యక్రమం మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్యం గురించి పట్టించుకొన్న పాపాన పోలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులు అధ్వానంగా ఉండేవి. దీంతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి వేలూ, లక్షల రూపాయలు ఖర్చు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుల పాలైన వారు ఎందరో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగార్చింది. 108 అంబులెన్స్ లను గాలికొదిలేసింది.
మారిన పరిస్థితులు
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఆరోగ్య శ్రీ పథకంలో కొత్త వ్యాధులను చేర్చారు. నెట్వర్క్ ఆస్పత్రులను పెంచారు. కొత్త 108, 104 వాహనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నాడు – నేడుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపురేఖలు మారాయి. మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేశారు. పరికరాలను సమకూర్చారు. ఈ కోవలోనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తొలి విడత సక్సెస్
ఆరోగ్య సురక్ష విడత కార్యక్రమం విజయవంతంగా జరిగింది. దీనికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది 1,45,35,705 గృహాలను సందర్శించి సర్వే చేశారు. 6,45,06,018 వైద్య పరీక్షలు జరిగాయి. 60,27,843 ఓపీలు నమోదయ్యాయి.
రూరల్ పరిధిలో 10,033, అర్బన్ పరిధిలో 2,390 శిబిరాలు నిర్వహించారు. తదుపరి వైద్యం కోసం 1,64,982 మంది నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేయబడ్డారు. మంగళవారం నుంచి మొదలైన ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం ఆరు నెలలపాటు కొనసాగుతుంది.
సాధారణంగా ప్రజలు తమ ఆరోగ్య సమస్యలపై అధిక మొత్తంలో నగదు ఖర్చు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. అయితే జగనన్న తీసుకున్న చర్యలతో పేదలపై భారం చాలావరకు తగ్గింది.