మరొక చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్‌ను మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా సిద్ధమేనా? పేదల భవిష్యత్‌ని, పేదలని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతిసోదరుడు, ప్రతి స్నేహితుడు, ప్రతి అవ్వా, తాతా మీరంతా సిద్ధమేనా? అంటూ దెందులూరులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ గర్జించారు. వివరాల్లోకి వెళితే
2024 లో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సిద్ధం బహిరంగ సభలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భీమిలిలో జరిగిన సిద్ధం సభకు ఊహించని ప్రతిస్పందన దక్కడంతో దెందులూరులో జరిగే సభపై అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ ఊహించని రీతిలో లక్షలాదిగా ప్రజలు సిద్ధం సభకు కదిలివచ్చారు. 115 ఎకరాల్లో ఏర్పాటు చేసిన స్థలం కూడా సరిపోక జాతీయ రహదారిపై సుమారు 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సభలో సీఎం జగన్ ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతూనే తన సంక్షేమపాలన ఎలాంటిదో వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
జగన్ ఒంటరివాడు కాదు
మన రాష్ట్రంలో మన కర్మ ఏమిటంటే.. రామాయణం, మహాభారతం..ఈ రెండింటిలో ఉన్న విలన్లంతా…ఓ చంద్రబాబు రూపేణా, ఈనాడు రూపేణా, ఆంధ్రజ్యోతి రూపేనా, టీవీ5 రూపేణా, దత్తపుత్రుడి రూపేణా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవర్టులు.. ఇంత మంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకుని రెడీగా ఉన్నారు. కానీ వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుందంటే.. జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్లవైపు నుంచి చూసినప్పుడు ఇంత మంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడిలానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటంటే ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్‌కు మీరు స్ధానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ గుండెల్లో ఉండడం ఇదీ నిజం.జగన్ ఏనాడూ ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులు, వారి ఎల్లో పత్రికలు, టీవీలు అయితే.. నాకున్న తోడు ఏమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న ఆ దేవుడు.. నన్ను గుండెల్లో పెట్టుకున్న మీరు. ఇది నాకున్న బలం.
ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం మీద నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారు అంటే ఏ రకంగా వాళ్ల స్పందన, ప్రేమ ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్న నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యమే నిదర్శనం.
మీరు కృష్ణుడు- మీ అర్జునుడు జగన్..
జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్టుడి పాత్ర పోషిస్తూ మీరు, మీకు తోడు అర్జునుడిని నేను.. మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా.. కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాం. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే.. మన సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి, అభివృద్ధి మీద.ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి.. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తున్న ఇంటింటి మంచి మీద, ఇంటింటి అభివృద్ధి మీద, పేద వాడి భవిష్యత్, పేదవాడి సంక్షేమం మీద గ్రామ గ్రామాన అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు దాడి చేస్తున్నారు.
ఈరోజు మన పెత్తందార్లంతా కూడా ఎవరి మీద దాడి చేస్తున్నారో ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి చేస్తున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడునేడుతో మారుస్తున్న స్కూళ్లు, హాస్పిటళ్లు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ దండ యాత్ర చేస్తోంది. ఆలోచన చేయండి. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి, చెండాడటానికి మళ్లీ మన వైయస్సార్సీపీ ప్రజా సైన్యం, మన కేడర్, మన లీడర్లు, మన అభిమానులు, నా కుటుంబ సభ్యులైన మీరంతా సిద్ధమేనా ? అని మరొక్కసారి అడుగుతున్నాను .
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏం చేసాడని అడగండి?
14 ఏళ్లు సీఎం బాబు ఏం చేశాడని ప్రతి ఇంటిని అడగండి. మీ గ్రామాల్లో ఇళ్లకు వెళ్లినప్పుడు ఆ ఇంట్లో అడగండి.. అమ్మ, అక్క, అన్న, తమ్ముళ్లను అడగండి. 1995లో సీఎం అయి, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు.. 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు.. మీ ఇంటికి గానీ, మీ ఊరికి గానీ, మీ సామాజికవర్గానికి గానీ, మీ కుటుంబ భవిష్యత్ కు గానీ ఏం చేశాడు? అని అడగండి. అదే పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా వారి బ్యాంకు అకౌంటు వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. ఆ పదేళ్లు అంటే చంద్రబాబు 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్ పాలనలో 5 సంవత్సరాలు.. బ్యాంకు అకౌంటు వివరాల్లో అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడిందన్నది వారినే చూడమని అడగండి. చంద్రబాబు పాలనలో ఆ పేద కుటుంబానికి బ్యాంకు అకౌంటుకు ఇచ్చింది ఎంత అని ఆ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములును అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు హయాంలో ఏమున్నాయి అని అడగండి. తన పాలనలో ఏనాడైనా ఒక్క రూపాయి అయినా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి చంద్రబాబునాయుడు ఒక్క రూపాయి అయినా వేశాడా? అని అడగండి. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన బాబు… 1994లో గానీ, 1999లో గానీ, 2014లో గానీ టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏనాడైనా 10 శాతం అయినా అమలు చేశాడా అని ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలను అడగండి.
బీసీ ఎస్సి ఎస్టీ మైనారిటీలకు అగ్రతాంబూలం
నామినేటెడ్ పోస్టులు, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్ యార్డులు, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు చట్టం చేసి మరీ ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్. జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. కేబినెట్లో 68 శాతం మంత్రి పదవులు నా… అంటూ నేను పిలుచుకొనే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ పిలుచుకొనే నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు మీ బిడ్డ పాలనేలోనే దక్కింది. నలుగురు డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్ పర్సన్ మొదలు.. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా,కనీవినీ ఎరుగని రీతిలో, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి నా అని పిలుచుకుంటూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నది ఎప్పుడంటే మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే.
అక్కచెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని…
అక్కచెల్లెమ్మలు పిల్లల్ని బడులకు పంపిస్తే చాలు వారికి తోడుగా ఉంటూ.. అమ్మ ఒడి, పిల్లలకు అండగా ఉంటూ విద్యా దీవెన, వసతి దీవెన, ఓ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ.. ఓ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, మహిళా సాధికారత, దిశ యాప్ అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. ఇది జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ప్రతి గ్రామంలోనూ ఇవాళ ఒక మహిళా పోలీస్ కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోనూ ఇవాల ఒక విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఆ గ్రామానికి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడంటే దానికి కారణం, ప్రతి ఇంట్లోనూ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేస్తూ, నేరుగా ఇంటికొచ్చి వైద్యం చేసి, మందులిచ్చే పరిస్థితి ఉందంటే కారణం.. మీ బిడ్డ. జరుగుతున్నది మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఆలోచన చేయండి. 108, 104, ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలుతీసుకొచ్చింది మహానేత దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి అయితే, వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేయిస్తున్నది, అవన్నీ మరింత మెరుగ్గా నాలుగు అడుగులు ముందుకు కదులుతున్నది, అమలు జరుగుతున్నది మీ బిడ్డ హయాంలో, వైయస్సార్ సీపీ పాలనలో.
కొత్తగా ఆసుపత్రులు, పోర్టులు, హార్భర్లు…
కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, కొత్త ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. ఉన్నవి విస్తరణ జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లు ఉరుకులు పరుగులుతో చేస్తున్నాం. పారిశ్రామిక వ్యక్తులు, సంస్థలు మన రాష్ట్రం వైపు లైను కడుతున్నాయి. జరుగుతున్నది మీ బిడ్డ పాలనలో, మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. నేను చెప్పిన ప్రతి విషయం వాస్తవం అవునా? కాదా? అని ఆలోచన చేయాలి. ప్రతి ఇంటికీ ఈ వాస్తవాలను తీసుకొని పోవాలి.
అర్హతే ప్రామాణికంగా పథకాలు– జగనన్నకే సాధ్యం.
ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయినీ కూడా ఎలాంటి లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా నేరుగా పేదలకు వారి చేతికి అందించడం సాధ్యం కాదు అని ఎవరైనా అంటే.. కాదు.. అది సాధ్యమే ఒక్క జగనన్న పాలనలో అది సాధ్యమే అని దేశానికే చూపించగలిగాం.
ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత– మీ బిడ్డ హయాంలోనే.
ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టో అని పెద్ద పెద్ద మాటలు చెబుతారు. మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం, తర్వాత మోసం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం .. ఇది సాంప్రదాయంగా జరుగుతోంది. మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. మీ బిడ్డ హయాంలో చెప్పింది ప్రతిదీ చేశాం. మొదటిసారి మేనిఫెస్టోను చూపించి 99 శాతం వాగ్దానాలను అమలు చేసి ప్రతి ఒక్కరికీ చూపించి వాళ్ల ఆశీస్సులు తీసుకుంటున్న పార్టీ ఎక్కడన్నా ఉందంటే… అది మన వైయస్సార్ సీపీ పార్టీ మాత్రమే.
రానున్నవి పేదల సంక్షేమాన్ని నిర్ణయించే ఎన్నికలు…
ఈ ఎన్నికలు ఎందుకింత ముఖ్యమో, అవసరమో ప్రతి పేద ఇంట్లో కూడా ఉన్న ఆ ప్రతి అవ్వాతాతకు, అక్కచెల్లెమ్మకు, అన్నదమ్ముడికి చెప్పాలి. ఇవి కేవలం ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకొనే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఈ 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్‌ను నిర్ణయించనున్న ఎన్నికలు ఈ ఎన్నికలని ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ప్రతి కుటుంబం, ప్రతి సామాజికవర్గం, ప్రతి ప్రాంతం భవిష్యత్, ప్రతి రైతన్న భవిష్యత్, అక్కచెల్లెమ్మల సంక్షేమం, ఇంటింటిలో జరుగుతున్న అభివృద్ధి, పిల్లల భవిష్యత్ అన్నీ కూడా ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని ప్రతి ఒక్కరూ గమనించండి. ఇప్పటికే మనం రూ. 3 వేలు చేసిన పెన్షన్, 1వ తేదీ ఉదయాన్నే ఈ రూ.3 వేల పెన్షన్ అందాలన్నా, భవిష్యత్ లో ఇది పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా.. మీ ఊరికే మీ ఇంటికే వైద్యం అందాలన్నా, వైద్యం కోసం ఏ పేదవాడూ అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదన్నా, అది మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని ఇంటింటి వెళ్లి చెప్పండి..
57నెలల్లో 124 సార్లు బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు జమ…
ఈ 57 నెలల్లో ఏకంగా మీ బిడ్డ 124 సార్లు ప్రజల కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం, లంచాలు లేవు, వివక్ష లేదు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనందరి ప్రభుత్వం రూ.2.55 లక్షల కోట్లు పేద కుటుంబాలకు పంపింది. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని, ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని, మరో 100 మందికి జరిగిన మంచి చెప్పాలని, గడపగడపకూ వెళ్లి కోరండి. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ జగనన్న 124 సార్లు మనకోసం బటన్ నొక్కాడు, జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి.. రెండు బటన్లు నొక్కలేమా అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. జగనన్నకు ఓటు వేయకపోవడం అంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే దాని అర్థం, ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
చంద్రముఖి బెడద శాశ్వతంగా పోయేలా 2 బటన్లు ఫ్యాను మీద నొక్కండి…
ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాను మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద.. ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్ర గ్రహణాలు ఉండవు.
లేదంటే.. చంద్రముఖి సైకిలెక్కుతుంది. టీ గ్లాసు పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ ఇంటింటికీ వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాక్యులా మాదిరిగా మీ తలుపు తడుతుంది అని… గడపగడపలోనూ ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి అక్కచెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకూ, అన్నదమ్ముడికీ చెప్పండి.
నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్…
రాష్ట్రాన్ని అన్యాయంగా, అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైయస్సార్ గారి మరణం తర్వాత ఆయన పేరును అన్యాయంగా చార్జ్ షీట్ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని నువ్వు కూడా రా కదలిరా అని చంద్రబాబు పిలుస్తున్నాడు.బాబుకు, దత్తపత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్‌కు.. ఈస్టేట్ కు, వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరూ మన రాష్ట్రంలో ఉండరు. వారంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. వారికి ఏనాడైనా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారంటే, ఆ ప్రజలతో పని పడినప్పుడే గుర్తుకొస్తారు. ఆయన సైకిల్ తొక్కడానికి ఇద్దర్ని, దాన్ని తోయటానికి మరో ఇద్దర్ని పొత్తులో తెచ్చుకొని రా కదలిరా అని పిలుస్తున్నాడు. చంద్రబాబుకు పొత్తే లేకపోతే కనీసం 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేసుకొనేందుకు అభ్యర్థులు కూడా లేరు.
ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. పేదవాడి భవిష్యత్ టార్గెట్‌గా, పేద వాడి సంక్షేమం టార్గెట్ గా వీరంతా వాళ్ల ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. వీరితో యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అని అడుగుతున్నాను. ఈ యుద్ధం.. 15 ఏళ్లుగా నాకు అలవాటే. నాతో నడిచారు కాబట్టి మీకూ అలవాటే. ఇదీ ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన.. ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లోంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
మంచి పాలన అందించామని గర్వంగా చెప్పగలుగుతాం. ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం. ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా గొప్ప పాలన ఇవ్వగలం అని చూపించాం. ప్రజలకు మంచి చేయగలిగాం. ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. ఇక్కడున్న మనలో ఎవరైనా ఏ పదవికైనా పోటీ పడితే.. రాష్ట్ర ప్రజలు తమకు జరిగిన మంచికి మనల్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ గెలవనంత మెజార్టీతో గెలిపించే కార్యక్రమం జరుగుతుంది. అందుకే భవిష్యత్ లో ఇంతకంటే గొప్పగా మన వారికి పదవులిచ్చే పార్టీ మనది. ఎంతో భవిష్యత్ ఉన్న పార్టీ.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం…
వ్యక్తిగతంగా ఒక్క విషయం చెబుతున్నా. పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్న, మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒక్కటే. గొప్పగా సేవ చేయండి. గొప్పగా మంచి చేయండి. లంచాలు, వివక్ష లేని పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి. మీలో ప్రతి ఒక్కరికి మరో రెండు మెట్లు ఎక్కించే బాధ్యత నాదీ అని తెలియజేస్తున్నాను.వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్. 25 ఎంపీలకు 25 ఎంపీలు మన టార్గెట్. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గడానికి వీలే లేదు అని తెలియజేస్తున్నాను. ఈ లక్ష్యాన్ని చేరుకొనేలా గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..? సంక్షేమ పథకాల రద్దుకు జరిగే కుట్రల మీద యుద్ధానికి మీరంతా సిద్ధమేనా..?
.మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. మనకు తోడు పైన దేవుడు, మంచి జరిగిన ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మ, అన్నదమ్ముడు, అవ్వాతాత మనకు తోడు. రాబోయే 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రజాక్షేత్రంలో పోరాడటానికి ప్రతి ఒక్కరూ సిద్ధమని దిక్కులు పిక్కటిల్లేలా చెప్పండి. సిద్ధమా?.. అని అడుగుతున్నాను. దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో మరో 3 నెలల్లో మనందరి ప్రభుత్వం ఇంతకు మించిన ఉత్సాహంతో కొలువుదీరుతుందని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.