ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఎదురుచూస్తున్న భక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యలో కొలువైన బాలరాముడుని సందర్శించుకునేందుకు భక్తులు దేశం నలుమూలల నుండి తరలి వస్తున్నారు. దాంతో భక్తుల కోసం రావులపాలెం డిపో నుండి కాశీ – అయోధ్య యాత్ర ప్రత్యేక బస్సును ఏపీఎస్ఆర్టీసీ నేడు ప్రారంభించింది.
భక్తులు అన్నవరం, సింహాచలం, అరసవల్లి, పూరీ, కోణార్క్, భువనేశ్వర్, గయా, కాశీ, త్రివేణి సంగమం, అయోధ్య తదితర పుణ్యక్షేత్రాలను దర్శించే విధంగా ఈ యాత్రను రూపొందించారు. పుణ్యక్షేత్రాల దర్శనం అనంతరం బస్సు తిరిగి రావులపాలెం చేరుకుంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే భక్తులకు ఈ ప్రత్యేక బస్సు వరమని చెప్పవచ్చు. ఈ యాత్ర ప్యాకేజీపై మరిన్ని వివరాలకు సమీప ఏపీఎస్ఆర్టీసీ బస్సు డిపో నందు సంప్రదించగలరు.