ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. కాగా ఈ సమావేశంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపగా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు దక్కన్నాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ రూ.3,600 కోట్ల పెట్టుబడితో 600 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనుంది . సుమారు 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కనున్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో ఆగ్వాగ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.4వేల కోట్లు ఖర్చుతో 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కల్పన ద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి ఉపాధి లభిస్తుంది.
జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ రూ. 12,065 కోట్ల పెట్టుబడితో 3350 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. వీటిలో సత్యసాయి జిల్లా ముదిగుబ్బవద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడుల్లో 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డి.హీరేహాల్, బొమ్మనహాళ్ 850 మెగావాట్ల, వైయస్సార్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కనున్నాయి.
నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలిమండలం జలదుర్గం వద్ద రూ.1287 కోట్ల పెట్టుబడితో రెండు 171.60 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్టులను జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుతో ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1350 కోట్లు ఖర్చుతో 200 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, ఆర్ధిక, ప్రణాళిక, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, జీఏడీ స్పెషల్ సీఎస్ కె ప్రవీణ్ కుమార్, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ముఖ్యకార్యదర్శి (హేండ్లూమ్స్ అండ్ టెక్ట్స్‌టైల్స్) కె సునీత, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పరిశ్రమలశాఖ కమిషనర్ సీహెచ్ రాజేశ్వర్ రెడ్డి, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ అండ్ ఎండీ ఎస్ రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.