ఈ ఫొటోలను చూస్తే ఏదో ప్రైవేట్ పాఠశాల అనిపిస్తోంది కదా.. కానే కాదు. ఇది అక్షరాలా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూల్. తరగతి గదిలో పిల్లలు కూర్చొనేందుకు డెస్క్‌లు, గోడపై నల్ల పెయింట్ స్థానంలో గ్రీన్ బోర్డు. ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కనిపిస్తున్నాయి. ఇదంతా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమే. ఆయన ప్రభుత్వం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సర్కారు పాఠశాలలను గాలికొదిలేసి ప్రైవేట్‌ను ప్రోత్సహించింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడేవారు. చాలామంది ఏకంగా చదువులు మానేసిన పరిస్థితి ఉంది.
అయితే జగన్ సర్కారు బడుల రూపురేఖలను మనబడి నాడు – నేడు కార్యక్రమం ద్వారా మార్చేశారు. ఆయన సీఎం అయిన తర్వాత ప్రతి బడిని బాగు చేస్తామని, ఇప్పుడు ఎలా ఉన్నాయి.. బాగు చేసిన తర్వాతో ఎలా మారాయో తేడాను మీరే గమనిస్తారని ప్రకటించారు. చెప్పనట్లుగానే చేసి చూపించారు. ఈ పథకాన్ని 2019-23 సంవత్సరాలకు గానూ రూ.12,000 కోట్ల బడ్జెట్‌తో 2019 నవంబరు 14వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రాజెక్ట్ మొత్తం 44,512 పాఠశాలలను కవర్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. తొలిదశలో రూ.3,669 కోట్లతో 15,715 బడులను బాగు చేశారు. రెండో దశ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి.
‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా బడుల్లో ఈ పనులు చేపట్టారు. ప్రహరీలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, గోడలకు పెయింటింగ్, గ్రీన్‌చాక్ బోర్డులు, విద్యార్థులు, సిబ్బంది కోసం కుర్చీలు, బెంచ్‌లు, ట్యూబ్ లైట్లతో విద్యుద్దీకరణ, బాలుర, బాలికలకు నీటి ప్రవాహంతో కూడిన మరుగుదొడ్లు, తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు, పెద్ద, చిన్న మరమ్మతులు చేపట్టారు. రెండో విడత నాడు-నేడు పనులను ఈ ఏడాది మార్చి లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో చకచకా జరుగుతున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, వర్చువల్ బోధన, టోఫెల్లో శిక్షణ, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ తదితర వాటిని ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటితోపాటు అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద తదితర పథకాలను పేద విద్యార్థుల కోసం తెచ్చింది. చంద్రబాబు హయాంలో అరకొర వసతులతో కనిపించిన ప్రభుత్వ బడులు.. నేడు జగన్ హయాంలో కొత్త కళ సంతరించుకున్నాయి..
– వీకే..