ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత పోల్ శాతం జరిగిందని, ఇది ఓటర్లలో చైతన్యం వెల్లివిరయడంతోనే సాధ్యమైందని ఎన్నికల అనంతరం ఈసీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికలకి ఇప్పుడు జరిగిన ఎన్నికలకి మధ్య ఓటర్లు ఎంతమంది పెరిగారు, అలాగే ఓట్లు వేసిన వారి శాతం ఎంత పెరిగింది? ఏ వర్గం వారు ఎక్కువ ఓట్లు వేశారు, ఓట్ల జాతరలో అధికంగా పాల్గొంది గ్రామీణులా , పట్టణ వాసులా అనే చర్చ అటు ఎలక్ట్రానికి మీడియాలోను, ఇటు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతుంది. ఇదిలా ఉంటే ఈ చర్చలు అన్నిటికి ముగింపు పలికేలా ఒక ప్రముఖ ఛానల్ పూర్తి డేటాతో ప్రసారం చేసిన పోల్ అనాలసిస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.
ఓట్ల శాతం పెరగడం మాకంటే మాకు లాభం చేసిందని రాజకీయ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్న వేళ, పెరిగిన ఆ ఓట్ల శాతం ఎవరని సదరు మీడియా ఛానల్ పోల్ అనాలసిస్ తో తేల్చేసింది. సదరు మీడియా ఛానల్ చూపిన డేటా ప్రకారం 2019 కన్నా, 2024లో 16 లక్షల మంది ఓటర్లు ఎక్కువ గా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని అయితే అందులో 12 లక్షల మంది మహిళలే ఉన్నారంటూ తేల్చేసింది. అలాగే రాష్ట్రం మొత్తం మీద 127 రూరల్ నియోజకవర్గాలలో 2019 కన్నా భారీగా ఓటింగ్ శాతం పెరిగిందని దీంతో మహిళలు, గ్రామీణులు రేపు రాబోయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించబోతున్నారని తెలిపింది. మహిళలు, గ్రామీణులు పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వంలో లబ్ది పొందారని వారు తమకే అండగా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్న మాట. ఎవరు ఏం చెప్పినా ఓటరు ఏం తీర్పు ఇచ్చాడో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.