పరిశుభ్రతలో ఏపీ దేశవ్యాప్తంగా సత్తా చాటింది. కేంద్రప్రభుత్వం ప్రతీషాత్మకంగా ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులు ఆంధ్రప్రదేశ్ లోని ఐదు నగరాలు గెలుచుకున్నాయి. గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ , తిరుపతి, పులివెందుల నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కాయి. ఏపీకి దక్కిన అవార్డుల్లో నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు కావడం గమనార్హం.
కాగా గుంటూరు జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించగా, గ్రేటర్ విశాఖపట్నం 4వ ర్యాంక్, విజయవాడ 6వ ర్యాంక్, తిరుపతి 8వ ర్యాంకు సాధించాయి. రాష్ట్రంలోని పలు నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో అనుసరిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అత్యంత పరిశుభ్రంగా, పట్టణాలు నగరాలను తీర్చిదిద్దినందుకుగానూ ఏపీ ఈ అవార్డులను దక్కించుకుంది.
2022లో అత్యుత్తమ పారిశుధ్య కార్మిక విధానాలు పాటించిన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్‌కు సఫాయిమిత్ర సురక్షా సెహెర్ అవార్డు కూడా దక్కింది. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని నగరాలను మునిసిపాలిటీలను అత్యంత పరిశుభ్రంగా ఉంచేందుకు క్లీన్ ఏపీ ప్రోగ్రాం ప్రారంభించారు. దాంతో పాటు పొడి చెత్త, తడి చెత్తను వేరుగా సేకరించేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు చెత్తను సేకరించేందుకు వీలుగా వాహనాలను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ తీసుకున్న అనేక విన్నూత్న నిర్ణయాలు విజయవంతం కావడంతో ఏపీ పరిశుభ్రతలో దేశంలోనే సత్తా చాటింది. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో క్లీన్ సిటీల్లో ఏపీ నంబర్ వన్‌గా నిలవడం గమనార్హం.