జాతీయ మీడియా దృష్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై పడింది. జగన్ – చంద్రబాబు– పవన్ త్రిముఖ పోరు ఉంటుందని అనుకున్న జాతీయమీడియాకి చంద్రబాబు – పవన్ పొత్తు పెట్టుకోవడంతో ద్విముఖ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
జనసేన టీడీపీ పొత్తు ప్రకటించినప్పటికీ, వారి పొత్తులో ఉన్న సమన్వయ లోపాలు, అంతర్గత కలహాలు, జనసైనికులు టీడీపీపై గుర్రుగా ఉండటం, కాపు నేతలు జనసేన పార్టీ విధానాలపై అసంతృప్తితో ఉండటం వంటివి వారి పొత్తు మైలీజీ తగ్గడానికి ప్రముఖ కారణాలుగా ఇప్పటివరకూ కనపడ్డాయి. అలాగే మహాసేన రాజేష్ కి టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకోవడం, ప్రకటించిన సీట్లపై టీడీపీలోనే అసంతృప్తులు ఉండటం వంటివి ఈ పొత్తుకి సంకటాలుగా జాతీయమీడియా భావిస్తోంది. ఈ తరహాలో కొన్ని వార్తలు జాతీయ మీడియాలో ప్రచురితమవుతున్నాయి.
జగన్ పార్టీ అన్ని రకాలుగా ముందంజలో ఉండగా, చంద్రబాబు ఇంకా పొత్తుల దగ్గరే ఆగిపోయారనీ, బీజేపీ వస్తుందో రాదో అని మార్చి 5 వరకు ఎదురుచూడాల్సి రావడం, జెండా సభకు లోకేష్ రాకపోవడం, శంఖారావం సభలు జరగకపోవడం వల్ల లోకేష్ అలక పాన్పు ఎక్కినట్టున్నారనే పుకార్లు రావడం, అధినేత నిర్ణయాలను సాధారణ కార్యకర్తలు కూడా ఖాతరు చేయకుండా తమ నిరసనలు తెలియజేయడం వంటివి టీడీపీ – జనసేన పొత్తుకు నష్టం కలిగించే అంశాలుగా జాతీయ మీడియా విశ్లేషిస్తుంది
పూర్తి ఆధిపత్యం చూపిస్తూ జగన్ ప్రచార సభలు మొదలుపెట్టడం, అభ్యర్ధులను ప్రకటించడం వంటి వాటి వల్ల వైసీపీ రేసులో ముందుగా ఉందని జాతీయ మీడియా తెలుపుతుంది. బీజేపీ నుంచి సానుకూల నిర్ణయం వచ్చేవరకూ చంద్రబాబు ఆగడం కూడా ప్రజలను అయోమయం చేసే అంశంగా ఉండటంతో అసలు టీడీపీకి కావలసినది ఏంటో సగటు ఓటరుకు అర్ధం కాకుండా ఉందనీ పలు వార్తలు దర్శనమిస్తున్నాయి. మొత్తమ్మీద టీడీపీ – జనసేన కూటమి కన్నా వైసీపీ ఈ ఎన్నికల కసరత్తులో చాలా ముందంజలో ఉంది.