స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. ఆయన శత జయంతి ఉత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో గౌరవించడం గమనార్హం. బిహార్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన కర్పూరి ఠాకూర్ తుదిశ్వాస విడిచేదాకా ఎమ్మెల్యేగా కొనసాగడం విశేషం.
బ్రిటిష్ ఇండియాలో బిహార్-ఒడిశా ప్రావిన్స్‌లోని సమస్తీపూర్ జిల్లా కర్పూరిగ్రామ్‌లో 1924 జనవరి 24వ తేదీన కర్పూరి ఠాకూర్ జన్మించారు. గతంలో పితౌజియాగా పిలువబడిన ఈ గ్రామం ఆయన పేరిట కర్పూరిగ్రామ్‌గా మార్చబడింది. స్వతంత్య్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించిన కర్పూరి ఠాకూర్ 1942, 1945ల మధ్య 26 నెలల పాటు జైలు జీవితం గడిపారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1952లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్‌పుర్ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1970 డిసెంబర్ లో ముఖ్యమంత్రిగా ఎన్నికై, బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తొలి కాంగ్రెసేతర సోషలిస్ట్ నేతగా చరిత్రకెక్కారు. 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు.
దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న పొందిన వారిలో ఠాకూర్ 49వ వ్యక్తి కావడం విశేషం. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయానికి ప్రతిరూపం ఠాకూర్. అణగారిన వర్గాల తరఫున పోరాడి వారిలో మార్పు రావడానికి ఎంతగానో కృషిచేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని జీవన విధానంగా మార్చుకున్న మహానుభావుడు. ఈ పురస్కారం ఆయన చేసిన కృషికి మాత్రమే కాదు భావితరాలకు స్ఫూర్తిగా, గొప్ప ప్రేరణగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసి కర్పూరి ఠాకూర్ గొప్పదనాన్ని చాటి చెప్పింది. తన పాలనా దక్షతతో జన నాయక్‌గా చెరగని ముద్ర వేసుకున్న కర్పూరి ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన కర్పూరి ఠాకూర్‌కు కేంద్రప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించడంతో ముఖ్యమంత్రి జగన్ హర్షం వ్యక్తం చేశారు.