ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రభుత్వం అమెరికా సంస్థతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సుమారు పన్నెండు లక్షల మంది విద్యార్థులకు ఈ ఒప్పందం వరం కానుంది.
వివరాల్లోకి వెళితే, అమెరికాకు చెందిన ఈ.డీ.ఎక్స్. ఎల్.ఎల్.సి అనే సంస్థ ఎడ్యుకేషనల్ సబ్స్క్రిప్షనల్ కాటలాగ్ పేరిట విద్యార్థులకు ఆధునిక సాంకేతిక కోర్సులప్ శిక్షణ ఇవ్వనుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్లెర్నింగ్, డేటా ఎనలిటిక్స్, వర్చువల్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ మొదలగు అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు.
2023 ఆగస్టు 17న ఈడీఎక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు, పన్నెండు లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాల కోసం నామినేషన్ ప్రాతిపదికన చెల్లింపులు చేయనున్నట్టు, ఈ ఒప్పందంలో ఏపీ ఉన్నత విద్యా మండలి నోడల్ ఏజన్సీగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.