చంద్రబాబు నాయుడి పాలనలో సహకార రంగం రూపురేఖలు కోల్పోయింది. సంఘాలన్నీ నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. అదే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. అనేక చర్యలు తీసుకోవడతో దేశంలో ఏ రాష్ట్రాంలో లేని విధంగా మన రాష్ట్రంలోని 2,037 పీఏసీఎస్‌లు (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు) అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నాయి.
ఐదు సంవత్సరాల క్రితం చూసిన సంఘాలను ఇప్పుడు చూస్తే ఇంతలా అభివృద్ధి చెందాయా అనిపించకమానదు. ఉదాహరణకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ హయాంలో 90 సంఘాలకు నష్టాలొచ్చాయి. జగన్ ప్రభుత్వంలో 70 సంఘాలకు స్పష్టమైన లాభాలొచ్చాయి. నాడు నష్టాల్లో మునిగితేలుతున్న సహకార సంఘాలను లాభాల బాట పట్టించడం ద్వారా రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించే స్థాయికి చేర్చడం విశేషం.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు (ఆప్కాబ్), జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సంయుక్తంగా సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి లాభాల బాట పట్టించాయి. ఇందుకు నాబార్డు కూడా అన్నివిధాలా సహకరిస్తోంది. గతంలో సహకార సంఘాలు కేవలం రైతులకు రుణాలిచ్చి.. రికవరీ చేయడం మాత్రమే చేసేవి. నేడు పరిస్థితి మారింది. నేడు మల్టీపర్పస్ గోదాములను నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గోదాముల సామర్థ్యం 1.54 లక్షల మెట్రిక్ టన్నులు ఉండటం విశేషం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. బంగారు ఆభరణాలు నిల్వ చేసుకునేందుకు వీలుగా స్ట్రాంగ్ రూములు, పెట్రోల్ బంకులు, పలు సంఘాలకు కమర్షియల్ షాంపింగ్ కాంప్లెక్స్‌లు, కమ్యూనిటీ హాల్స్, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు గోదాములు, ఆధునికీకరణ, మరమ్మతులు, మొబైల్ రైస్‌మిల్, లారీ వేబ్రిడ్జి ప్లాట్ఫారం, టెంట్ హౌస్, సూపర్ బజార్ల ఏర్పాటు, బంగారం ఆభరణాలపై రుణాలు తదితరాలను చేపట్టారు.
మినీ బ్యాంక్‌లుగా..
పీఏసీఎస్‌లు బ్యాంకింగ్ సేవలు అందించడంతోపాటు కామన్ సర్వీస్ సెంటర్లుగా కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వేగంగా కంప్యూటరైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. 2,037 పీఏసీఎస్‌లలో కంప్యూటరైజేషన్ కోసం ఆప్కాబ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. రూ.79.72 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద హార్డ్‌వేర్, డిజిటలైజేషన్, సిస్టమ్స్ పోర్ట్ కాంపోనెంట్లకు రూ.62.96 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వం రూ.40 కోట్లు విడుదల చేసింది. హార్డ్‌వేర్ సేకరణ జరుగుతోంది. సిస్టమ్ ఇంటిగ్రేషన్ కార్యకలాపాలను చేపట్టేందుకు నాబార్డుకు ప్రతిపాదనలు పంపారు. ప్రాజెక్టు అమలు కోసం రాష్ట్ర స్థాయిలో ఎస్పీఎంయూ, జిల్లా స్థాయిలో డీపీఎంయూ, పీఏసీఎస్ స్థాయిలో మైగ్రేషన్ బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే పనులు పూర్తి చేసి ఆన్లైన్లో లావాదేవీలను చేపట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.