వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలుచేస్తూ పేదల బ్రతుకుల్లో వెలుగు నింపారు. వివిధ దేశాల ప్రతినిధులు, రాష్ట్రాల అధికారులు రాష్ట్రంలో పర్యటించి ఇక్కడి సంక్షేమ పథకాలను వారి ప్రాంతాలలో అమలుచేసేందుకు ఆసక్తి కనబరిచారు.
ఆంధ్రప్రదేశ్‌లో పేదల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతమని ఢిల్లీ నేషనల్ డిఫెన్సు కళాశాల సీనియర్ డైరెక్టింగ్ స్టాఫ్, ఎయిర్ వైస్‌మార్షల్ మనీష్‌కుమార్ గుప్తా ప్రశంసించారు. ఢిల్లీలోని నేషనల్ డిఫెన్సు కళాశాలకు చెందిన సుమారు 20 మంది ప్రతినిధులతో కూడిన బృందం మనీష్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో పర్యటించింది. ఈ బృందం జనవరి 9, 2024 న రాష్ట్ర సచివాలయంలో పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది.
సమావేశంలో మనీష్‌కుమార్ మాట్లాడుతూ.. నేషనల్ డిఫెన్స్ కళాశాల ఫ్యాకల్టీ, కోర్సు సభ్యులతో కలిసి రెండ్రోజులుగా విశాఖపట్నం, అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించినట్లు.. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య, మహిళ, రైతు సంక్షేమం తదితర రంగాల్లో అమలుచేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు అక్కడి ప్రజలతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ ఎన్డీసీ బృందం పర్యటించి ఆక్కడ అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను పరిశీలించామని.. అయితే, ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే చాలా ముందంజలో ఉందని మనీష్‌కుమార్ కొనియాడారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యం, మహిళ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి పలు కార్యక్రమాలను అమలుచేస్తోందన్నారు. అలాగే, ప్రాథమిక విద్యాభివృద్ధికి.. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు.. పేద ప్రజల సంక్షేమానికి పలు వినూత్న కార్యక్రమాలు, పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న మిగతా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో రాష్ట్రంలో జరుగుతున్న పలు కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి మనీష్‌కుమార్ బృందానికి వివరించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, కులాల వారీగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఈ కార్యక్రమంలో ఆయా రంగాల ముఖ్యకార్యదర్శులు ఈ బృందానికి వివరించారు.