ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కార్యకలాపాలు ఇకపై కర్నూలు జిల్లా నుంచి జరగనున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కార్యాలయం కర్నూలు కేంద్రంగా జూన్ 2 నుంచి సేవలు అందించనుంది. సొంతభవనంతో సహా కర్నూలులో ఏపీఈఆర్సీ రాష్ట్రస్థాయి ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది.
గత ఏడాది విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 82(3), కేంద్ర చట్టం నెం 36 (2003) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.8 నోటిఫికేషన్ ఇచ్చిన విషయం అందరకి తెలిసిందే. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు వెలువడ్డా హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వచ్చింది. ఇక ఇప్పటి నుండి కర్నూలు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది.
విద్యుత్ వ్యాపారం చేయడానికి, అమ్మడానికి ఏపీఈఆర్సీ నుంచి లైసెన్స్ తప్పనిసరి. విద్యుత్ నియంత్రణ మండలి అనుమతితోనే టారిఫ్లు నిర్ణయిస్తారు. విద్యుత్ చార్జీలు పెంచడానికి, తగ్గించడానికి కూడా నియంత్రణ మండలి అనుమతి అవసరం. విద్యుత్ శాఖకు ఏపీఈఆర్సీ కోర్టు వంటిది. దీని అనుమతితోనే ఏ విషయంలోనైనా ముందుకు సాగాల్సి ఉంది. విద్యుత్ చట్టం సెక్షన్ 86 ద్వారా కమిషన్కు పలు విధులను నిర్దేశించారు. విద్యుత్ ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరా కార్యకలాపాలు, నిర్వహణను మెరుగుపరిచి, విద్యుత్ చార్జీలను నిర్ణయించడం లాంటి కీలక బాధ్యతలను మండలి నిర్వర్తిస్తుంది. విద్యుత్తు అంతర్రాష్ట్ర ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరాలో పోటీ మార్కెట్ల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, సంస్థాగత మార్పులను తేవడం లాంటివి చేపడుతుంది. పంపిణీ, సరఫరా కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, సేకరణ ప్రక్రియను నియంత్రిస్తుంది.
ట్రాన్స్మిషన్ లైసెన్సులు, డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులు జారీ చేస్తుంది. పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు మొత్తం విద్యుత్ వినియోగంలో ఎంత శాతం ఉండాలో నిర్ణయిస్తుంది. డిస్కంలు, ఉత్పాదక సంస్థల మధ్య వివాదాలపై విచారణ జరిపి పరిష్కరిస్తుంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేలా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం లాంటివి కమిషన్ ప్రధాన విధులుగా నిర్దేశించారు. ఇటువంటి కీలకమైన ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి కర్నూలులో ఏర్పాటు కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరువతోనే ఇది సాధ్యమైంది. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి భవన సముదాయాన్ని చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్ ఉండటంతో రాజకీయాలతో సంబంధం లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది.