ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన కూటమి మొదటి జాబితా ప్రకటించినప్పటి నుండి అసంతృప్తి నేతల అలకలు తిరుగుబాటులతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే రాజమండ్రి రూరల్, మైలవరం లాంటి నియోజకవర్గాల్లో టికెట్ ఎవరికిస్తారో తెలియక ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి అనంతపురం అర్బన్ సీటు చేరింది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో చోటు దక్కలేదు. పెనుగొండ సీటును సవితకు కేటాయించడంతో అసహనంతో ఉన్న ఆయన అనంతపురం అర్బన్ టికెట్ పై కన్నేశారు. ఆ స్థానంలో ఎలాగైనా పోటీ చేయాలని పావులు కదుపుతున్నారు. కాగా ఈ విషయాన్ని పసిగట్టిన అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తనకు టికెట్ ఇవ్వని పక్షంలో తన కుమారుడైన మధుకర్ చౌదరికి ఇవ్వాలని కోరుతూ మధుకర్ చౌదరితో ప్రచారం చేయించడం కూడా మొదలుపెట్టారు. టికెట్ తమకే కేటాయిస్తారనే ధీమాలో ఇరు నాయకులూ ఉన్న క్రమంలో టీడీపీ అధిష్టానం ఎటువైపు మొగ్గుతుందో అంతు చిక్కడం లేదు.
టికెట్ తమ కుటుంబానికి కేటాయించని క్రమంలో ఎన్నికల్లో సహకరించనని తేల్చి చెప్పిన ప్రభాకర్ చౌదరి తద్వారా బీకే పార్థసారథికి టికెట్ కేటాయిస్తే మాత్రం ఆయన ఓటమికి పని చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లైంది. ఇరు వర్గాలను రాజీ చేయకుంటే అనంతపురంలో టీడీపీ ఓటమికి బాటలు వేసుకున్నట్లేనని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరి చంద్రబాబు నిర్ణయం ఎటువైపు మొగ్గుతుందో వేచి చూడాలి..