ఏపీలో గత 42 రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంగన్వాడీల సమ్మెపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. కాగా అంగన్వాడీలను రెచ్చగొడుతూ లబ్ధిపొందాలని కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అంగన్వాడీలు ఛలో విజయవాడ కార్యక్రమంలో కొన్ని అరాచక శక్తులు ఉద్రిక్తతలు, హింసను ప్రేరేపించేలా ప్రణాళికలు రూపొందించినట్లు నిఘా వర్గాలకు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కాగా విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఉదయం 10 లోపు విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. గడువులోపల విధుల్లో చేరిన వారిని అనుమతించాలని పేర్కొన్న ప్రభుత్వం, విధుల్లోకి వచ్చిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
అంగన్వాడీలతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ప్రభుత్వం మరియి అంగన్వాడీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని రాజకీయ శక్తులు తమ రాజకీయ లబ్ది కోసం అంగన్వాడీలను రెచ్చగొడుతూ ఉండడం వల్ల అంగన్వాడీలు మెట్టు దిగలేదు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మెను కొనసాగిస్తామంటూ అంగన్వాడీలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఛలో విజయవాడకు అంగన్వాడీలు పిలుపునివ్వడం అంగన్వాడీల ముసుగులో కొన్ని అరాచక శక్తులు శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసారు. ఇంతలో ప్రభుత్వం నుండి అంగన్వాడీల తొలగింపునకు ఆదేశాలు రావడం గమనార్హం