అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఇటీవలే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు తాజాగా జనసేన అధినేతతో సమావేశం కావడం రాజకీయా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో అధికార వైఎస్సార్సీపీ లో చేరిన అంబటి రాయుడు ఎనిమిది రోజుల్లోపే ఆ పార్టీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. అంతకుముందు కొద్ది నెలలుపాటు వైఎస్సార్సీపీ తరపున పలు కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యమంత్రి జగన్ పరిపాలన బాగుందని వ్యాఖ్యలు చేసిన రాయుడు ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఈ నేపథ్యంలో ఆయనకు వైఎస్సార్సీపీ అధిష్ఠానం గుంటూరు పార్లమెంట్ సీటును కేటాయించనున్నట్లు వార్తలు వచ్చాయి.
అనంతరం ఏర్పడిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో లావు శ్రీ కృష్ణ దేవరాయలకు గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో అంబటి రాయుడు వైఎస్సార్సీపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దుబాయిలో జరగనున్న టి20 లీగ్ లో ముంబయ్ ఇండియన్స్ తరపున పాల్గొనేందుకు వైసిపికి రాజీనామా చేశానని అంబటి రాయుడు ట్విట్టర్ లో వెల్లడించారు.
కానీ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో ఆయన జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా గుంటూరు నుండి బరిలోకి దిగనున్నారని అందుకోసమే చర్చలు జరుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే తన అనూహ్య నిర్ణయాలతో క్రికెట్ కెరీర్ ను నాశనం చేసుకున్న రాయుడు అదే పంథాలో రాజకీయాల్లో కూడా పయనిస్తుండడంతో రాజకీయ కెరీర్ ను కూడా నాశనం చేసుకుంటున్నాడా అని సర్వత్రా చర్చ నడుస్తోంది..