మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేందుకు సిద్ధమైంది. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు తన సోదరుడు, వైసీపీ రాజ్యసభ సభ్యుడైన ఆళ్ళ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎంఓకి చేరుకొన్నారు.
ఆళ్లకు జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించడంతో 2014, 2019 ఎన్నికల్లో ఆయన నుంచి గెలిచారు. 19లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ను మట్టి కరిపించారు. కాగా 24 ఎన్నికల్లో బీసీని మంగళగిరి నుంచి బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించారు. గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో కొంత అసంతృప్తికి లోనైన ఆర్కే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా పేరు ఉన్న ఆర్కే కు పిసిసి ప్రసిడెంట్ గా ఉన్న షర్మిల విధానాలు నచ్చలేదు. ఆమె చంద్రబాబుతో కలిసి జగన్ పై కుట్రలు పన్నుతున్నారని గుర్తించారు. దీంతో తాను చేస్తున్న తప్పును తెలుసుకున్నారు.
అదే సమయంలో ఆర్కేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేర్చేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపారు. లోకేశ్‌కు మరోమారు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచించారు. ఈ క్రమంలో ఆర్కే మళ్లీ వస్తే మంగళగిరిలో పార్టీ మరింత బలంగా మారుతుందని పెద్దలు భావించారు. రామకృష్ణారెడ్డి కూడా మళ్ళీ జగన్ వెంట నడిచేందుకు ఒప్పుకొన్నారు. మధ్యాహ్నం భేటీ అయ్యాక పూర్తి వివరాలు తెలుస్తాయి.
ఆర్కే సొంత గూటికి చేరుతున్నారన్న విషయం తెలియగానే బాబు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయ్యిందని చెప్పొచ్చు. ఈసారి ఎలాగైనా లోకేశ్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని బాబు కుటుంబ సభ్యులు అందరూ ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఆర్కే అలిగి బయటకి వెళ్లిపోవడంతో వైసీపీ ఓటు బ్యాంక్ లో కొంతైనా చీలిక వచ్చి లోకేష్ గెలిచే అవకాశాలు మెరుగు అవుతాయని టీడీపీ భావించింది. అయితే రామకృష్ణారెడ్డి పునరాగమనంతో వారి ఆశలన్నీ నీరుగారిపోనున్నాయి.