ఏపీడీసీ (ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్) పై కొన్ని పత్రికలు విషం చిమ్మాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాకా ఊదుతున్న ఏపీడీసీకి ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారని ఓ పత్రికలో వచ్చిన ఆరోపణలను ఏపీడీసీ ఖండించింది. ఆ పత్రిక చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారని స్పష్టతనిచ్చింది.
2020-21 మరియు 2021-22 సంవత్సరాలలో ఏపీడీసీకి సంబంధించిన ఆర్థికాంశాల నివేదికలన్నీ కాగ్ కి ఇప్పటికే సమర్పించామని 2022-23 సంవత్సర నివేదికల్ని కూడా త్వరలో కాగ్ కి అందిస్తామని ఏపీడీసీ వెల్లడించింది. ఏపీడీసీ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ చేసిన మొత్తం ఖర్చు కేవలం 88.56 కోట్లు మాత్రమే అని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధి విధానాలు, నిబంధనల ప్రకారమే ఏపీడీసీలో ఉద్యోగుల ఎంపిక జరిగిందని ఏపీడీసీ తేల్చి చెప్పింది. దరఖాస్తు చేసిన అభ్యర్థుల అర్హతల ఆధారంగా ఉద్యోగుల నియామకం జరిగిందని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరించాలనే ఉద్దేశ్యంతో జీతం తీసుకోకుండా వీసీ & ఎండీగా చినవాసుదేవరెడ్డి పని చేస్తున్నారని, అంతేకాకుండా ఐడ్రీమ్ మీడియా ఏపీడీసీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఎలాంటి ప్రకటనలు అందుకోలేదని తెలిపింది. ఆయా మీడియా హౌస్ లు/ వెబ్సైట్ లకు ఉన్న రీచ్ ఆధారంగా ప్రకటనలు విడుదల చేస్తామని ఏపీడీసీపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలా ఆరోపణలు చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీడీసీ వెల్లడించింది.
తనపై వస్తున్న నిరాధార ఆరోపణలను, అసత్య ప్రచారాన్ని ఏపీడీసీ వీసీ & ఎండీ చినవాసుదేవరెడ్డి ఖండించారు. ఏపీడీసీ లో ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా జీతంగా తీసుకోలేదని స్పష్టం చేశారు. ఏపీడీసీకి మొదటి రెండేళ్లు 100 కోట్లు కేటాయించినా కొన్ని సాంకేతిక కారణాల వల్ల మొదటి ఏడాది కేవలం 4.03 కోట్లు మాత్రమే ఖర్చు చేశామని, రెండో ఏడాది 12.31 కోట్లు ఖర్చు చేశామని ఈ ఖర్చుల్లో ఉద్యోగుల జీతాలు, మౌలిక సదుపాయాల కల్పన, ఆఫీస్ మెయింటెనెన్స్, ఫాక్ట్-చెక్ యూనిట్ ఖర్చులతో పాటు ప్రభుత్వ స్కీమ్ ప్రమోషన్లు ఉంటాయని తెలిపారు.
ఏపీడీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా జీతాల చెల్లింపు జరుగుతుందని, ఏపీడీసీ ఉద్యోగుల ద్వారా హైకోర్టు న్యాయమూర్తులపై బురదజల్లారంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఎందుకంటే అప్పటికి ఏపీడీసీ ఉనికిలో లేదని స్పష్టం చేశారు. డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై తాజా వాస్తవిక సమాచారంతో రాష్ట్ర పౌరులకు అవగాహన కల్పించడమే ఎపీడీసీ ఉద్దేశ్యం. ఫ్యాక్ట్‌చెక్ యూనిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఏదైనా తప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేయడానికి కూడా కృషి చేస్తామని సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కథనాలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీడీసీ వీసీ & ఎండీ చినవాసుదేవరెడ్డి వెల్లడించారు.