వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని నిరుపేదలకు గూడు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టారు. ఇందులో భాగంగా 30,76,018 మంది మహిళలకు ఉచితంగా పట్టాలిచ్చారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లను చేస్తున్న ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్లు పంపిణీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈనెల 2వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే ఏడు లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు చేశారు. సెలవు దినాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మరో పదిరోజుల్లో మిగిలినవి పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు అయిన తర్వాత రూ.10 జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లపై కన్వేయన్స్ డీడ్లను ముద్రించి ఇస్తారు. ఇందుకోసం 20 లక్షల రూ.10 స్టాంప్ పేపర్లను సిద్ధం చేస్తోంది. ఈనెల మూడో వారంలో కన్వేయన్స్ డీడ్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు.
అక్కచెల్లెమ్మల పేరుపై..
జగన్ ప్రభుత్వమే గృహాలు కూడా కట్టిస్తోంది. మొత్తం 70,811.50 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్లు వేయించింది. వాటిల్లో తాగునీరు, రోడ్లు, విద్యుత్, డ్రెయినేజీ తదితర సౌకర్యాలు కల్పించింది. ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వైఎస్సార్, జగనన్న కాలనీలుగా పిలుస్తున్న ఈ ప్రాంతాల్లో చాలా ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడా లేని విధంగా పేదలకు ఇచ్చిన భూమిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసేందుకు చర్యలు తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీని పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించారు. వాటిలో స్థలం ఉన్న లబ్ధిదారులు పదేళ్ల తర్వాత ఎవరి ప్రమేయం లేకుండా వాటిపై సర్వ హక్కులు పొందుతారు. జగనన్న ప్రతి అక్కచెల్లెమ్మ పేరుతో సుమారు రూ.10 లక్షలకు పైన ఆస్తి సమకూరుస్తున్నారు. దీంతో వారు ఆయన్ను తమ తోడబుట్టిన వ్యక్తిలా చూసుకుంటున్నారు.