ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే.. ఈ మాటలు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు చెబుతుంటారు. కానీ ఈసారి చెప్పింది స్వయానా ప్రతిపక్షానికి చెందిన నేత. ఆయనే టీడీపీకి చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్. సోమవారం గుంటూరు జిల్లా చేబ్రోలుని వడ్లమూడిలో రా కదలి రా సభ జరిగింది. ఇందులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమయంలో ఆలపాటి జగన్‌పై పొగడ్తలు గుప్పించడంతో అటు బాబు.. ఇటు తెలుగుదేశం శ్రేణులు అవాక్కయ్యారు. ఇది ఆలపాటి మనసులో మాటేమోనని తమ్ముళ్లు వ్యాఖ్యానించడం విశేషం. దీనికి కారణాలు లేకపోలేదు. మొదట్లో వేమూరు నుంచి బరిలో దిగిన రాజేంద్రప్రసాద్ ఆ తర్వాత తెనాలిలో పోటీ చేశారు. ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. చాలా సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్నారు. ఈసారి కూడా తెనాలి సీటు ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గతంలో తెనాలి నుంచి గెలిచారు. ప్రస్తుతం ఇరు పార్టీ మధ్య పొత్తు నేపథ్యంలో సీటు తనకే కావాలని ఆయన పట్టుబడుతున్నారు. పవన్ కోరిక మేరకు చంద్రబాబు సేనకే కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆలపాటి వెనక్కు తగ్గడం లేదు. పాదయాత్ర కూడా చేశారు. టికెట్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ మనోహర్‌కు కేటాయిస్తే ఆలపాటి ఇండిపెండెంట్‌గా బరిలో దిగే అవకాశం లేకపోలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. తెనాలి అభ్యర్థిత్వంపై టీడీపీ అధినేత వ్యవహార శైలిపై రాజేంద్రప్రసాద్ కొద్దిరోజులుగా గుర్రుగానే ఉన్నారు. పార్టీ వీడుతారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ సమయంలో ఆయన రా కదలి రా సభలో జగన్‌ను ఆకాశానికి ఎత్తడం టీడీపీలో చర్చనీయాంశమైంది. చాలామంది టీడీపీ నేతల్లాగే ఆలపాటి కూడా తన మనసులో మాట బయటపెట్టాడేమో..