రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే పరిస్థితుల్లేవని, దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని చంద్రబాబు, ఎల్లో మీడియా నిత్యం ఏడుస్తుంటారు. వాస్తవానికి ఈ నాలుగున్నరేళ్లలో కొత్తవి ఎన్నో వచ్చాయి. కాకపోతే వాటి గురించి ఎల్లో గ్యాంగ్ ఎప్పుడూ చెప్పదు. ఏపీని ఫార్మా హబ్ తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నం. ఇప్పటికే 300కు పైగా కంపెనీలున్నాయి. వాటి ఉత్పత్తుల విలువ రూ.41,500 కోట్లు. తాజాగా రాష్ట్రంలోని అనాకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే మరో వంద కంపెనీలు ఏర్పాటవుతాయి. మొత్తం 2 వేల ఎకరాల్లో ఈపీసీ విధానంలో నిర్మాణానికి ఏపీఐఐసీ బిడ్లు ఆహ్వానించింది. రూ.1,234.75 కోట్లతో డిజైన్ చేసి అభివృద్ధి చేసేలా టెండర్లు పిలిచింది.
చైనా నుంచి ఫార్మా దిగుమతులను తగ్గించుకోవాలని కేంద్రం మూడు బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంది. 16 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ ఈ పార్కును దక్కించుకుంది. ప్రభుత్వం చూసిన భూమిలో వెయ్యి ఎకరాల్లో ఫార్మా పరిశ్రమలు, 595 ఎకరాల్లో ఏపీఐ–డీఐఎస్ సింథసిస్, 414 ఎకరాల్లో ఫెర్మిటేషన్స్ తదితర వాటికి వినియోగించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం పార్క్ ద్వారా రూ.14,340 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే 100కు పైగా ఫార్మా యూనిట్లతో 27,360 మందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుందని భావిస్తున్నారు. పరోక్షంగా వేల మందికి లబ్ధి చేకూరుతుంది.
నాడు వైఎస్సార్
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు ఫార్మా రంగం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. ఆయన హయాంలో 2,400 ఎకరాల్లో ఏర్పాటు చేసిన జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఇప్పటికే మైలాన్, ఫైజర్, డాక్టర్ రెడ్డీస్, అరబిందో వంటి 60కి పైగా దిగ్గజ సంస్థలు ఉన్నాయి. నేడు ఆయన తనయుడు సీఎం జగన్ ముందుచూపుతో కొత్త ఫార్మా సిటీ రూపుదిద్దుకోనుంది.