సింగపూర్ రవాణా శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ మంత్రి పదవితోపాటు ఎంపీ సభ్యత్వానికి, సింగపూర్ అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ(పీఏపీ) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నెల 12న సింగపూర్ మంత్రి రాజీనామా చేస్తే ఇక్కడ తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు పుడుతున్నాయి. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి భూ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన ఈశ్వరన్ సింగపూర్ ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో భారీ అవినీతికి ప్లాపడినట్లు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం ‘కరెప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (సీపీఐబీ) తేల్చి చెప్పింది. ఈ కేసులో నేరం రుజువైతే ఆయనకు కనీసం ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష పడే అవకాశాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు, ఈశ్వరన్ కుట్రపూరితంగా వ్యవహరించి సింగపూర్ ప్రభుత్వం టీడీపీ సర్కారుతో ఒప్పందం చేసుకుందని భ్రమింపజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చి ఒప్పందం సమయంలో సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ అసెందాస్ సిన్బ్రిడ్జ్ సెంబ్ కార్ప్ కన్సార్షియంను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానం ముసుగులో ఇతర సంస్థలేవీ పోటీ పడకుండా ఏకపక్షంగా 2017 మే 2న కట్టబెట్టేశారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,722 కోట్లు వెచ్చించే AP ప్రభుత్వానికి కేవలం 42 శాతం వాటా కల్పించారు. రూ.306 కోట్లు మాత్రమే వెచ్చించే అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి ఏకంగా 58 శాతం వాటా కట్టబెట్టేశారు. ఆ కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు. అందుకు ఈశ్వరన్ సహకరించారు. తద్వారా స్టార్టప్ ఏరియాలో రూ.లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. స్టార్టప్ ఏరియాను ఆనుకుని ఉన్న 1,400 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా బినామీ పేర్లతో కొల్లగొట్టింది. మరోవైపు ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డును ఆనుకుని భారీగా భూములు కొనుగోలు చేసింది.
తాజాగా సింగపూర్ ఈశ్వరన్ పాపాలు పండి 2.98 లక్షల అమెరికన్ డాలర్ల మేర భారీ అవినీతికి పాల్పడినట్టు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం ‘కరెప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (సీపీఐబీ) నిగ్గు తేల్చడంతో చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు కూడా స్కిల్ స్కామ్ లో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా విచారణ దశలో ఉన్న రూ.5 వేల కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం, రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, రూ.10 వేల కోట్ల ఇసుక కుంభకోణం, రూ.6,500 కోట్ల మద్యం కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల్లో కూడా చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.