కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన రైల్వే బడ్జెట్ వివరాలను వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ. 14 వేల 209 కోట్లు కేటాయించగా ఆంధ్ర ప్రదేశ్లోని రైల్వే మౌలిక, రక్షణ సంబంధించిన ప్రాజెక్టుల కోసం రూ. 9,138 కోట్లు కేటాయించినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన బడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కేటాయింపులు తెలుగు రాష్ట్రాలకు జరిపినట్లు వెల్లడించారు. 2009 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కోసం రూ. 886 కోట్లు కేటాయిస్తే దానికి 10 రెట్లు ఎక్కువగా 931 శాతం మేర ఎక్కువ బడ్జెట్ ఎన్డీయే ప్రభుత్వం కేటాయించిందని,ఆంధ్రప్రదేశ్ లో రైల్వేలకు 98 శాతం విద్యుద్దీకరణ పూర్తయిందని, ఏడాదికి 240 కిలోమీటర్ల చొప్పున ట్రాక్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్న మంత్రి పలు మౌలిక సదుపాయాలు, భద్రతకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం ఈ కేటాయింపులు చేసినట్లు తెలిపారు.