ఊర్లో ఎక్కడ ఏం జరిగినా.. బెడ్రూంలోకి కూడా దూరిపోయి న్యూస్ అందించడానికి వెనుకాడని పత్రికను నడిపే ఆ అధినేత మాత్రం తన సంస్థలో జరిగిన అతి ఘోర ప్రమాదాన్ని బయటకు రానీయకుండా చేసిన వైనమిది. ఇందులో నష్ట పడ్డవారు ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన వారు కాబట్టి ఈ మాత్రం వివరాలైనా బయటకొస్తున్నాయి కానీ, అదే సామాన్య మనుషులనైతే తమ డబ్బు బలంతో, రాజకీయ అండతో నోరు నొక్కేసేవారే!
ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీ విస్టెక్స్ తన సిల్వర్ జూబ్లీ ఏడాదిని పురస్కరించుకుని ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తమ సంబరాలను జరుపుంకుంటుంది. అందులో భాగంగా సెలబ్రేషన్స్ జరిగే ప్రతి చోటుకి ఆ కంపెనీ సీఈఓ సంజయ్‌షా రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే కార్యక్రమపు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చారు. రామోజీ ఫిలిం సిటీ, లైమ్లైట్ గార్డెన్ లోని కాంక్రీట్ స్టేజీ పైన ఇరవై అడుగుల ఎత్తు నుంచి తాళ్ళతో వినూత్నంగా ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తుండగా, ఒక్కసారిగా తాళ్ళు తెగి సంజయ్‌తో పాటు అతని సహోద్యోగి రాజు దాట్ల ఒక్కసారిగా స్టేజీపైకి పడిపోయారు. పలు చోట్ల ఎముకలు విరిగి రక్తపు మడుగులో ఉన్న వారిని హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి జరిగిన జాప్యం వల్ల సీఈఓ సంజయ్‌షా మృతి చెందారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఫిలిం సిటీ ఉద్యోగుల నుంచి ఎటువంటి రక్షణ చర్యలు ఎదురవకపోగా, ఎంతో వేడుకున్నాక ఇరవై నిమిషాల తర్వాత కేవలం ఒక్క అంబులెన్సును మాత్రం సమకూర్చారు. అందులో సీఈఓ సంజయ్షాను హయత్‌నగర్‌లోని ప్రైవేటు హాష్పటల్కు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మరో క్షతగాత్రుడు విశ్వనాధ్ రాజు కోసం అంబులెన్స్ అడిగినా ఏర్పాటు చేయకపోవడంతో, ఆయన తన సొంత వాహనంలోనే హాస్పటలకి వెళ్ళవలసి ఉంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
అత్యంత విశాలం అనే చెప్పుకునే ఫిలింసిటీలో రెస్క్యూ టీమ్ లేకపోవడం, అవసరమైనన్ని అంబులెన్సులు లేకపోవడం, అసలు సరైన భద్రతాపరమైన జాగ్రత్తలు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి కారణమైన రామోజీ ఫిలింసిటీ, ఉషాకిరణ్ ఈవెంట్స్‌పై తాను క్రిమినల్ కేసు పెట్టానని విశ్వనాధ్ రాజు సోదరుడు జానకీరామ్ రాజు తెలిపారు. విలువలూ వలువలులా ఫీలైపోయి వార్తలందించే ఈనాడు పేపరులో, తమ ఆఫీసుకి కూతవేటు దూరంలోనే ఇంత ప్రమాదం జరిగినా అసలు ఒక్క వార్త కూడా రాకపోవడం గమనార్హం.