ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. రోహిత్ శర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), తిలక్ వర్మ(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, సామ్ కరణ్ రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. 49 పరుగులకే 7 వికెట్స్ కోల్పోయి టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది అషుతోష్ శర్మ(28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. శశాంక్ సింగ్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 12 బంతుల్లో పంజాబ్ విజయానికి 23 పరుగులు అవసరమవ్వగా.. 19వ ఓవర్ వేసిన హార్దిక్ ఓ వికెట్ తీసి 11 పరుగులిచ్చాడు. దాంతో ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 12 పరుగులు అవసరమయ్యాయి. అయితే క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో రబడా ఔటవ్వడంతో ముంబై విజయం సాధించింది.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/21), గెరాల్డ్ కోయిట్జీ(3/32) మూడేసి వికెట్లు తీయగా..ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు. బౌలింగ్ లో రాణించిన జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపిక అయ్యాడు