కాంగ్రెస్ పార్టీ చాలా పురాతన పార్టీ.. ఒకరకంగా చెప్పాలంటే అందుకే ఆ పార్టీ పద్ధతులు అన్నీ విభిన్నంగా ఉంటాయి. ఇంకోలా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానం ఏం చెబితే ఆ మాటలకు ఆ పార్టీ నాయకులందరూ తలాడించాల్సిందే. ఇప్పుడు ఎప్పుడూ దేశం మొత్తం ఇదే విధానంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కానీ ఆ సంస్కృతికి ఎదురెళ్ళి నిలిచిన నాయకుడు వైఎస్సార్ గారు మాత్రమే.
కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందంటే.. రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి.. కానీ అక్కడ ఎవరు కష్టపడ్డారు.. ఎవరు అనుభవం ఉన్న నాయకులు.. ఎవరికి ఆ ప్రాంతంపై ఎక్కువ పట్టుందనే విషయాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ అధిష్టానం ఎవరి పేరు చెబితే వారే అక్కడి ముఖ్యమంత్రి. సీఎల్పీ మీటింగుతో సంబంధం లేకుండా కాంగ్రెస్ అధిష్టానం సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారన్న నిర్ణయాన్ని పంపుతుంది. అది ఓపెన్ చేశాక ఎవరి పేరు ఉంటే వారే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదే కాంగ్రెస్ సీల్డ్ కవర్ సంస్కృతి.. ఆ సంస్కృతి ప్రకారమే 1989-1994 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ళలలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. అదే మొదటిసారి కాదు అంతకుముందు కూడా కాంగ్రెస్ లో ఇలాంటి సంప్రదాయం నడిచింది. కాంగ్రెస్ పార్టీకి అలాంటి సీల్డ్ కవర్ చరిత్ర ఉంది. అయితే ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనపడకుండా పోయింది.
ప్రస్థుతం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఎవరు ముఖ్యమంత్రో తెలచ్చకుండా కాంగ్రెస్ అధిష్టానం ప్రవర్తిస్తున్న తీరు వైఎస్సార్ గారికి ముందు రాజకీయాలను గుర్తు చేస్తుంది. ఎందుకలా అనాల్సి వచ్చిందంటే భారతదేశ స్వాతంత్య్ర పోరాట సమయం నుండి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకానొక దశలో తన పట్టును కోల్పోయింది. దాదాపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనపడకుండా పోతున్న వేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ను అధికారంలోకి తిరిగి తీసుకువచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరుగునపడిపోయిన కాంగ్రెస్ కు ఊపిరిలూదిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. వైఎస్సార్ 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత ఎంపీగా నాలుగుసార్లు, ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించారు. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరుంది.
2004 ఎన్నికల ముందు 2003లో మండు వేసవిలో వైఎస్సార్ 1467 కి.మీ. పాదయాత్ర చేపట్టారు. వైఎస్సార్ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. రాష్ట్రం మొత్తం ఊరూరా ప్రజలు ఆయనకు బ్రహ్మరంధం పట్టారు. పాదయాత్ర పొడుగునా రాష్ట్రంలో కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. అనంతరం 2004లో ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఉత్సుకతతో కూడిన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్ లో నేనంటే నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్దిని అంటూ చాలామంది నాయకులు మీడియా ముందుకొచ్చారు. కానీ అప్పటి వరకూ అంత కష్టపడ్డ రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం రాజకీయాల గురించి.. రానున్న సీల్డ్ కవర్ గురించి ఏమాత్రం ఆలోచనలు చెయ్యకుండా కుటుంబంతో ఫారన్ టూర్ కి వెళ్ళిపోయారు. ఆ తరువాత ప్రజలంతా ఆశించిన రీతిలో వైఎస్సార్ గారు ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే 2004 ఎలక్షన్స్ లో రాజశేఖర్ రెడ్డి గారి అనుచరులలో కొంతమందికి కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్లు ఇవ్వలేదు. వేరెవరైనా అయితే అధిష్టానం ఒప్పుకోలేదంటూ ఇంకోసారి చూద్దామని అనుచరులకే సర్ధి చెబుతారు. కానీ నాయకులలో అత్యత్తముడైన వైఎస్సార్ మాత్రం మర్రి రాజశేఖర్ (చిలుకలూరి పేట) వంటి నాయకులను ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలో దింపారు. అలా నమ్మిన సిద్ధాంతల కోసం కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురు తిరిగి నిలబడిన నాయకుడు వైఎస్సార్.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.. అవసరమైనప్పుడు ఉగ్రంగా గాండ్రించే సింహం ప్రశాంతమైన ముఖవర్చస్సుతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అది ఆయన రూపం వ్యక్తిత్వం.. అందుకే శాసించడం తప్పా ఎక్కడా ఆయన జంకిన చాయలు మనకు కనపించవు.
2009 ఎన్నికల్లో కూడా అంతే.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పంపించే సీల్డ్ కవర్ సంస్కృతిని ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మార్చేసారు. ఫలితాలతో పదవులతో సంబంధం లేకుండా ఎన్నికల అనంతరం కుటుంబంతో వైఎస్సార్ గారు టూర్ వెళ్ళిపోయారు. కానీ వెళ్ళే ముందు ఆయన చెప్పిన ఒక మాట ఏటంటే “ ఈ ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఆ ఫలితాలకు నేనే బాధ్యత వహిస్తాను “ అన్నారు. ఆ ఒక్క మాటతో కాంగ్రెస్ పార్టీ సీల్డ్ కవర్ తో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి ఎవరన్నది తేటతెల్లమయిపోయింది.
ఐదేళ్ళలలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిన కాంగ్రెస్ అధిష్టానం రెండో సారి కూడా వైఎస్సార్ గారినే ముఖ్యమంత్రిగా కొనసాగించాలనుకున్నదా లేదా అనేది ఇక్కడ మనం చెప్పలేం. కానీ ఆంధ్రప్రదేశ్ లో పార్టీతో సంబంధం లేకుండా వైఎస్సార్ గారు ఉన్నంత వరకు ఆయనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేవారనేది మాత్రం కాదనలేని నిజం. తరువాత ప్రమాదవశాత్తు వైఎస్సార్ గారు మరణించడం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోవడం జరిగింది. ఇప్పటికీ సమైక్యంధ్రను కాంక్షించిన వారెవరైనా “ వైఎస్సార్ బ్రతికి ఉంటే రాష్ట్ర విభజన జరగకపోయేది “ అనే మాట అంటారు.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో అనుకోని రీతిలో మొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే కాంగ్రెస్ గెలిచింది కానీ ఎవరు ముఖ్యమంత్రి అనేది మాత్రం అధిష్టానం నుండి సీల్డ్ కవర్ ఇంకా రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తరువాత సీఎల్పీ మీటింగులో కాంగ్రెస్ నాయకులంతా చర్చించుకోని ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటున్నారన్నది చెప్పాలి.. కానీ ఇప్పుడు సీఎల్పీ మీటింగ్ అయిపోయినా కూడా ఇంకా అధిష్టానం పంపే సీల్డ్ కవర్ కోసమే ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ చరిత్రలోనే పార్టీ అధిష్టాన సీల్డ్ కవర్ సంస్కృతికి బ్రేక్ వేసిన నాయకుడు వైఎస్సార్ గారు మాత్రమే. ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు మళ్ళీ అదే సీల్డ్ కవర్ కోసం ఎదురుచూస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.