తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆ పార్టీల నాయకులు అతిగా ఊహించుకుంటుంటారు. కానీ క్షేత్ర స్థాయిలో వారి బలం అంతంతమాత్రమే. సినిమాల వల్ల పవన్‌కు అంతో ఇంతో క్రేజ్ ఉంది. లోకేశ్‌ను టీడీపీ నాయకులే పట్టించుకోరు. ఇక్కడ చెల్లని కాసులు ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తున్నాయి. దీంతో ఏపీ జనం నవ్వుకుంటున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో భారతీయ జనతా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. అలాగే లోకేశ్ గురువారం తమిళనాడులోని కోయంబత్తూరులో కమలం పార్టీ అభ్యర్థి అన్నామలై తరఫున ప్రచారం చేస్తారని అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు. తమిళనాడుకు తిరు లోకేశ్ స్వాగతమంటూ మోదీ, చంద్రబాబు, అన్నామలై చిత్రాలతో కూడిన ట్వీట్ చేశారు.
లోకేశ్ 2019లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాడు. 2024లోనూ అనుకూల పరిస్థితులు లేవు. దీంతో చంద్రబాబు కుమారుడిని ఆ నియోజకవర్గానికే పరిమితం చేసి అక్కడే ప్రచారం చేసుకోమన్నాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ మహిళను అభ్యర్థిగా నిలబెట్టడంతో లోకేశ్ చెమటోడాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న కమ్మ సామాజికవర్గం యువతను పిలిపించుకుని తన తరఫున ప్రచారం చేయించుకుంటున్నాడు. ఇక పవన్ విషయానికొస్తే 2019లో భీమవరం, గాజువాక రెండు చోట్ల దారుణ ఓటమి చవిచూశాడు. 2024లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక చాలాకాలం తర్జనభర్జన పడ్డాడు. చివరికి పిఠాపురంలో తేలాడు. ఇక్కడ టీడీపీ ఇన్చార్జి వర్మను పక్కన పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. వందల కోట్ల రూపాయలను కుమ్మరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. నా గెలుపు మీ చేతుల్లో ఉందని ఆయనకు సేనాని చెప్పాడంటే ఓటమి భయం ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడం వల్ల బీజేపీ ఒరిగేదేమీ లేదు.
ఇక్కడి తెలుగువారే ఆ పార్టీల నేతల్ని పట్టించుకోవడం లేదు. ఇక వేరే రాష్ట్రాల్లోని ఆయా ఊర్లలో ఉన్నవారు ఎలా మాట వింటారు. ఒకవేళ అన్నామలై గెలిస్తే చంద్రబాబు క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తాడు. తన కుమారుడు ప్రచారం వల్లేనని డబ్బా కొడతారు. బళ్లారిలో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తే ఇక్కడ పవన్ ఫ్యాన్స్ హంగామా చేస్తారు. అసలు వాళ్లిద్దరూ ఏపీలో తాము పోటీ చేస్తున్న స్థానాల్లో గెలవడానికి ఆపసోపాలు పడుతున్నారు. ఇది మర్చిపోతే ఎలా..
– వీకే..