ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో మిచౌంగ్ తుఫాన్ తీరాన్ని తాకింది. తీరం దాటిన తర్వాత మిచౌంగ్ తుఫాన్ బలహీనపడి
సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని వలన మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో విస్తారంగా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
కాగా ఇప్పటికే తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల వేలాది ఎకరాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల ప్రభావంతో పలు జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు:
తుపాను ప్రభావం ఉన్న ఎనిమిది జిల్లాల్లో 181 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి లోతట్టు ప్రాంతాల వారిని తరలిస్తున్నారు. ఇప్పటికే తుఫాన్ సహాయక కార్యక్రమాల్లో ఐదు ఎన్డీఆర్ఎఫ్, మరో ఐదు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాలుపంచుకుంటున్నాయి. క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కంది పప్పు, పామాయిల్, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కిలో చొప్పున అందించాలని ప్రతీ బాధిత కుటుంబానికి రూ.500 పెంచి రూ.2,500 ఇవ్వాలి.. బాధిత వ్యక్తికి రూ.వెయ్యి ఇవ్వాలని తుపాను ప్రభావంతో దెబ్బతిన్న గుడిసెలు, ఇళ్లు ఉంటే వారికి తక్షణమే రూ.10 వేలిచ్చి ఆదుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.