1980 లో స్థాపించబడిన ఒక పార్టీ, తన మొదటి ఎన్నికలో కేవలం రెండంటే రెండు సీట్లు గెలిచింది.. అది కూడా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ఓడిపోయారు ఇంకొకరు అసలు పోటీ చేయనే లేదు….
అలాంటి ఒక పార్టీ ఎన్నేళ్లు మనగలదు? పదేళ్లు? లేదా 20? అది కూడా అరాకొరా సీట్లతో? అంతేగా?
కానీ ఆ పార్టీ తన తర్వాతి ఎలక్షన్స్ లో అంటే 1989 లో ఏకంగా 85 సీట్లు గెలిచింది… రెండేళ్లు పూర్తి కాకుండానే 1991 లో ఆ సంఖ్య 120 అయింది..
ఐదేళ్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా నిలిచి రెండు సార్లు అధికారం లోకి వచ్చింది…
తర్వాత పదేళ్లు అధికారం కోల్పోయినా నిలబడగల్గింది.. 2014 లో 282 సీట్లు గెలిచి పాతికేళ్ల తర్వాత దేశం లో మొదటిసారి మెజారిటీ సాధించిన పార్టీ గా నిలిచి, మళ్లీ 2019 లో 303 సీట్లు సింగిల్ హ్యాండ్ తో గెలిచింది అంటే….
దాని జర్నీ ఎంత గొప్పదై ఉండాలి? ఎన్ని ఒడుదుడుకులు ఎదుర్కుని ఉండాలి? ఎంత కష్టపడి ఉండాలి??
ఇద్దరు – ఇద్దరంటే ఇద్దరు, 1957 నుండి కలిసి ప్రయాణిస్తున్న మిత్రులు అటల్ బిహారీ వాజ్పయి, లాల్ కృష్ణ అద్వానీ లు జనతా పార్టీ నుండి బయటికి వచ్చి స్థాపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ.. అదే పార్టీ ఇవాళ దేశాన్ని ఏకఛత్రాధిపత్యం తో ఏలుతుంది అంటే దానికి ఎందరో తమ వంతు కృషి చేసుండచ్చు గాకా… కానీ దాని ఎదుగుదల ఇంత వేగంగా జరగడానికి కారణం మాత్రం అందరికన్నా ఎక్కువ అద్వానీనే అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు..
అవును ప్రధానిగా.. పార్టీ ఫేస్ గా వాజపేయి కి కూడా దీనిలో పెద్ద వాటానే ఉంది కాదనలేని విషయం.. కానీ వాజపేయి “ స్టేట్స్‌మెన్ “ అయితే అద్వానీ మాత్రం పక్కా పొలిటిషియన్.. అందుకే సుదీర్ఘకాలం బీజేపీ అధ్యక్షునిగా ఉన్న రికార్డ్ ఇంకా తన ఖాతాలోనే ఉంది..
రెండు సీట్లు మాత్రమే గెలిచాక తర్వాతి ఎన్నికని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని స్థితిలో 1986 లో పార్టీ పగ్గాలు చేపట్టి 2 నుండి 120 వరకు ఆ సంఖ్యని తీసుకెళ్లడం అంటే సాధారణ విషయం కాదు… సింగల్ లార్జెస్ట్ పార్టీ గా నిలిపి పార్టీ ని అధికారంలోకి తీసుకురావడం అంతకన్నా సాధారణ విషయం కానే కాదు.. ఇదంతా ఆయన ఒంటి చేత్తో చేసిందే..
1991 డిసెంబర్ 6 నా జరిగిన బాబ్రీ మసీదు సంఘటన కు ముందు అద్వానీ చేసిన రథయాత్ర దేశంలో ఒక సంచలనం.. షబానో బానూ కేస్ తర్వాత దేశంలో మైనారిటీ అప్పీజ్మెంట్ పెరుగుతుందని ప్రతిపక్షాల విమర్శకు కౌంటర్ చేసేందుకు రాజీవ్ గాంధీ అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడతాం అనే విషయాన్ని తెరమీదకి తెచ్చాక… బీజేపీ యొక్క ముఖ్య సిద్ధాంతాలైన అఖండ్ భారత్, ఆర్టికల్ 370 రద్దు వంటి వాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం కూడా జత చేసింది ఆయనే.. దానికోసం 1990 సెప్టెంబర్ 25 న దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదినం నాడు ప్రారంభించిన రధయాత్ర 10 వేల కిలోమీటర్ల రోడ్ మ్యాప్ థో దేశంలో హిందువులందరినీ సంఘటిత పరచి వారిని ఆకర్షించే కార్యక్రమం మొదలైంది.. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆ యాత్రన్ని అడ్డుకునే వరకూ అడుగడుగునా జనం నీరాజనం పట్టారు.. అద్వానీ వెళ్తున్న దారిలో జనాలు గుడి గంటలు మోగించేవారు, విల్లు చేతబట్టి రాముడిలా కనిపించేలా అద్వానీ పోస్టర్లను అడుగడుగునా అంటించేవారు… ఆయన ప్రసంగాలు కూడా ఉద్వేగం తో ప్రజలను మైమరపించేలా చేసేవి…
1991 డిసెంబర్ 6, రథయాత్ర బీహార్ లో ఆపివేసిన తర్వాత బీజేపి తో కలిపి వీహెచ్‌పీ తన అనుబంధ సంస్థలతో కలిపి ఒక పెద్ద బహిరంగ సభను జరిపి కరసేవక్స్ ని ఆహ్వానించింది..
ఉదయం 7 గంటలకల్లా కరసేవక్స్, శివసేన కార్యకర్తలు ఆ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.. ఉదయం పదిగంటలకు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి వంటి అగ్రనాయకులు వచ్చారు.. ఒకరి తర్వాత ఒకరు ప్రసంగించడం ప్రారంభించాక అక్కడున్న కరసేవకులు, శివసేన, బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా బాబ్రీ మసీద్ వైపు పరుగులు తీసి చూస్తుండగానే బాబ్రీ మసీద్‌ను నేలమట్టం చేసారు… వారిని రెచ్చగొట్టారు అనే అభియోగం తో వారిపై కేసు నమోదయి అది 2020 వరకూ కొనసాగి 2020 సెప్టెంబర్ లో ఆయనతోపాటు 31 మందిని సుప్రీం కోర్ట్ నిర్దోషులుగా ప్రకటించింది..
ఆయన ఎత్తుకున్న కార్యం రామజన్మ భూమిలో రామ మందిర నిర్మాణం… దానికోసం ఆయన చేపట్టిన రథయాత్ర లో అనుచరగణం లో ఒకడిగా ఉన్న మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు మోడీ చేతుల మీదగా పూర్తయింది.. ఆయన జన్మకి ఆయన పొందిన అతిపెద్ద ఆత్మతృప్తి అదే కావచ్చు.. ఎందుకంటే ఆయనెప్పుడూ ప్రధాని కావాలని కోరుకుంది లేదు.. పట్టుబట్టి ఉంటే 1996 లోనే తాను టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న ఎంపీ ల ద్వారానే ప్రధాని అయ్యేవాడు.. ప్రధాని పదవికి వాజ్‌పేయి సరైన వాడని ఆయన్నే ఆ పదవిలో కూర్చోబెట్టి తను ఉప ప్రధాని పదవితో సరిపెట్టుకున్నాడు… త్యాగం ఆయన నైజం.. ఎందుకంటే తనకంటే, తన వాళ్ల కంటే పార్టీ పెద్దదని, దాని నిర్ణయమే శిరోధార్యం అని బలంగా నమ్ముతారాయన.. దానికి సాక్ష్యమే బిజెపి పార్టీ లో ఉండే క్రమశిక్షణ.. పార్టీ అధినాయకత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే కింది స్థాయి కార్యకర్త వరకూ అందరూ తూచాతప్పకుండా పాటిస్తారు తప్ప ఎవరూ వ్యతిరేకించినట్లు, పార్టీ స్టాండ్ ని నిరసించినట్లు ఎన్నడూ బీజేపీ లో చూడం.. మిగతా పార్టీ లతో బీజేపీ ని వేరు చేసేది ఇదే.. వాజ్‌పేయి, అద్వానీ ల పార్టీ సంస్థాగత నిర్మాణమే దానికి కారణం…
2005 లో తను పుట్టిన పాకిస్థాన్ లోని సింధ్ లో ఉన్న కరాచీ కి వెళ్లి, అక్కడే ఉన్న మహమ్మద్ అలీ జిన్నా సమాధిని దర్శించడం, అక్కడే జిన్నా ఒక లౌకిక వాదని పొగడటం తో ఆయన ఆరెస్సెస్ నుండి కాస్త ప్రతిఘటన ఎదుర్కున్నాడని రాజకీయ వర్గాల్లో జరిగిన ప్రచారం.. ఆ తర్వాతే పార్టీ లో అద్వానీ ప్రాబల్యం కూడా తగ్గింది అది వయసు రీత్యా కూడా కావచ్చు…
కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలుకుతూ, ఒక పెద్ద రాజకీయ వ్యవస్థ శృష్టిలో కీలక భాగస్వామి అవుతూ.. ఢిల్లీ మెట్రో పాలిటన్ చైర్మన్ గా, జనతా పార్టీ కి కార్యదర్శి గా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, 7 సార్లు లోకసభ సభ్యునిగా, 4 పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా, ఉత్తమ పార్లమెంటేరియన్ గా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా, కేంద్ర హోమ్ శాఖా మంత్రిగా, భారత దేశానికి 7 వ ఉప ప్రధానిగా తన 69 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు, ఎన్నో ఒడిదుడుకులు, విజయాలు, పరాజయాలు, ఎన్నో రకాల హేళనలు, మరెన్నో అభినందనలు చూసి చూసి ఉన్న కళ్లతో తన జీవితాశయం అయిన అయోధ్య రామమందిర నిర్మాణాన్ని కళ్లతో చూసుకున్న లాల్ కృష్ణ అద్వానీ కి భారత ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న చిన్నగా కనిపిస్తుందేమో….
గట్టిగా సంకల్పించుకుంటే.. నువ్వు కావాలనుకున్న పని ఏదో విధంగా సాధించబడుతుంది, దానికి నీ కష్టం, నీ పక్కన వారి ప్రోత్సాహం, నీ అనుచరుల తోడ్పాడు, నీ తర్వాతి తరం పట్టుదల అన్నీ తోడ్పడతాయి… అనడానికి అద్వానీ జీవితమే ఓ గొప్ప ఉదాహరణ…
భారత రత్న లాల్ కృష్ణ అద్వానీ జీ కి అభినందనలు…