ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకు చేర్చేందుకు, పేదలకు సంక్షేమ ఫలాలను నేరుగా అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మకంగా శ్రీకారం చుట్టిన వ్యవస్థ గ్రామ, వార్డు సచివాయాలు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలను ప్రారంభించారు. వీటిల్లో 1.34 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చేందుకు పలు రాష్ట్రాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా సచివాలయ ఉద్యోగుల విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి చోట తప్పనిసరిగా 8 మంది ఉండేలా సర్దుబాటు చేయనుంది.
ఇందులో భాగంగా 7,900 సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువగా, 3,300 చోట్ల ఎనిమిది మంది కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అధికంగా ఉన్న చోటు నుంచి సర్దుబాటు చేయాలని ఆదేశాలిచ్చింది. మొత్తంగా 5,000 మందికి స్థాన చలనం కలుగుతుందని భావిస్తున్నారు. అయితే ఏ జిల్లాలోని వారికి ఆ జిల్లాలోనే పనిచేసే అవకాశం ఇస్తారు. ఎన్నికలకు ముందే కలెక్టర్ల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని మార్గదర్శకాలను ప్రకటించింది. దీనికి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాలు – వలంటీర్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో యంత్రాంగం కసరత్తును ప్రారంభించింది.