గత కొన్నేళ్లుగా మంచు విష్ణుకు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. చివరి హిట్ చిత్రంగా నిలిచిన ఆడో రకం ఈడో రకం చిత్రం వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తోంది. ఈ ఎనిమిదేళ్లలో ఎంత ప్రయత్నం చేసినా హిట్ మాత్రం విష్ణుకు అందని ద్రాక్షగా మిగిలింది. దీంతో కన్నప్పతో మంచు తనను విష్ణు తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తారన్న ప్రచారం జరుగుతుంది. తాజాగా భక్త కన్నప్పలో ఓ ప్రత్యేక గీతంలో తమన్నా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇదొక సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఇప్పటికే తమన్నా జైలర్ సినిమాలో చేసిన ప్రత్యేక గీతం యువతరాన్ని ఒక ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ వార్తపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోవడంతో ఇది నిజమా కాదా అనే డోలాయమానంలో అభిమానులున్నారు.
ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తన సొంత బ్యానర్ లో కన్నప్పను నిర్మిస్తుండగా ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గత కొంత కాలంగా మంచు విష్ణు కుటుంబం ట్రోలర్ల చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. మరి కన్నప్పతో అయినా హిట్ ట్రాక్ ఎక్కి ట్రోలర్ల నోళ్లు మూయిస్తారో లేదో వేచి చూడాలి.