టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఛాతీలో తీవ్రమైన నొప్పితో ఆస్పత్రిలో చేరారు. గురువారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సాయాజీ షిండే గుండెలో బ్లాక్ ఉన్నట్లు పరీక్షల్లో బయటపడటంతో వెంటనే ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సాయాజీ షిండే హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయని ఆంజియోప్లాస్టీ తప్పదని చెప్పడంతో ఆయన చికిత్స కోసం రెడీ అయ్యారని విజయవంతంగా సర్జరీ పూర్తి చేశామని మహారాష్ట్ర సతారాలోని ప్రతిభా ఆసుపత్రిలో వైద్యుడు సోమనాథ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. కాగాసాయాజీ షిండే అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
మహారాష్ట్రకు చెందిన సాయాజీ షిండే జేడీ చక్రవర్తి నటించిన సూరి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.. కానీ చిరంజీవి ఠాగూర్ చిత్రంలో ప్రతినాయకుడిగా ప్రేక్షకులకు చేరువకాగా గుడుంబా శంకర్, అతడు, ఆంధ్రుడు, లక్ష్మి, ఆట, దుబాయ్ శీను, పోకిరి, అరుంధతి, సోలో, సూపర్, కృష్ణ, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, తదితర సినిమాలో నటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్పురి, హిందీ భాషల్లో కూడా ఆయన సినిమాలు చేయడం గమనార్హం .