అంజలి కెరీర్ లో 50 వ చిత్రంగా వచ్చిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ప్రేక్షకాదరణ పొందడంలో విఫలమైంది. పదేళ్ల క్రితం అనగా 2014లో రూపొందిన గీతాంజలికి సీక్వెల్ గా రూపొందిన ఈ హారర్ కామెడీ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య కీలక పాత్రల్లో నటించారు. కోన వెంకట్, ఎంవివి సత్యన్నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.
ఈ చిత్రం ఈనెల 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా అవన్నీ నిజాలు కాదని తేలిపోయింది. ఈ సినిమా మే 8వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుందని చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది. మరో రెండు రోజుల్లో ఆహా వేదికగా గీతాంజలి మళ్ళీ వచ్చింది స్ట్రీమింగ్ కి వస్తుందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.