పేరుకి పవర్ స్టార్.. నిర్మాతలంతా తనతో సినిమా చేయడానికి ఉవ్విళ్ళూరుతారని, సినిమాకి 50 కోట్లు ఇచ్చి మరీ హీరోగా పెట్టుకుంటారని ఆయనే చెప్పుకుంటారు. సినిమాల్లో రాజకీయ డైలాగులు, రాజకీయాల్లో సినిమా డైలాగులు చెబుతూ వీకెండ్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ సినిమా కొనడానికి ఇంకా ఎవరూ ముందుకు రావడం లేదంటే ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
మొన్నటికి మొన్న పుష్ప 2 డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ ఏకంగా 275 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆఖరికి మిడ్ రేంజ్ హీరోగా ఉన్న నాగ చైతన్య తండేల్ చిత్రానికి కూడా నెట్ ఫ్లిక్స్ 40 కోట్లు చెల్లించి ఓటిటి రైట్స్ దక్కించుకుంది. కానీ తెలుగు సినిమా అగ్ర హీరోగా చలామణి అవుతున్న పవన్ కళ్యాణ్ చిత్ర డిజిటల్ హక్కులను కొనేందుకు ఏ ఒక్క సంస్థ ముందుకు రాకపోవడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమాల వల్ల వచ్చే నష్టాలు ఎలా ఉంటాయో సామాన్యుడికి కూడా అర్థం అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి చిత్ర ఓటిటి రైట్స్ అమ్ముడు కాలేదని తెలుస్తుంది. అందుకే ముందే ప్రకటించిన విడుదల తేదీకి ఓజి విడుదలయ్యే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.
వేరే భాషలలో హిట్ అయిన సినిమాలు తెలుగులో రీమేక్ చేయడానికి ముందుండే పవన్ కళ్యాణ్, ఆఖరికి ఆ సినిమాలు తెలుగులో డబ్ అయి థియేటర్లలో విడుదల అయినా సరే నిర్మాతలతో భారీ బడ్జెట్ ఖర్చు పెట్టించి మరీ రీమేక్ చేసి వారి ఆర్థిక కష్టాలకు కారణం అవుతారనే విమర్శ కూడా ఉంది. 2001లో వచ్చిన ఖుషి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రాలలో బ్రేక్ ఈవెన్ అయినవి వేళ్లపైనే లెక్క పెట్టొచ్చు. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది మినహా మిగిలినవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. పవన్ కళ్యాణ్ రీమేక్ ల పిచ్చి ఎలా ఉంటుందంటే అజిత్ హీరోగా నటించిన తమిళ చిత్రం వీరం తెనుగులో వీరుడొక్కడేగా డబ్ అయి థియేటర్లలో విడుదలైంది. తెలుగులో వచ్చిన ఆ సినిమాని కూడా రీమేక్ చేయడానికి వెనుకాడలేదు పవన్ కళ్యాణ్. కాటమరాయుడు పేరుతో వీరం చిత్రాన్ని రీమేక్ చేస్తే దారుణ ఫలితాన్ని బాక్స్ ఆఫీస్ వద్ద మూటగట్టుకుంది.
అక్కడితో ఆగకుండా సముద్రఖని, తంబి రామయ్య ప్రధాన పాత్రలు పోషించిన వినోదాయ సిత్తంని ఓటిటి వేదికగా తెలుగులో కూడా విడుదల అయింది. అయినా సరే ఆ చిత్రాన్ని బ్రో పేరుతో రీమేక్ చేసి చిత్ర నిర్మాత నష్టాలకు పవన్ కళ్యాణ్ కారణమయ్యారు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన అయ్యప్పమ్ కోషియమ్ ను భారీ బడ్జెట్ తో భీమ్లా నాయక్ పేరుతో రీమేక్ చేసి నష్టాలు కొనితెచ్చుకొనేలా విజయవంతం అయ్యారు.
నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకుని సినిమాలు ప్రకటించడం, పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు నటిస్తాడా అని ఆ నిర్మాతలు ఎదురు చూడటం పరిపాటిగా మారిపోయాయి. ఎన్నో ఏళ్ల క్రితం ప్రకటించిన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఎప్పుడొస్తాయో ఇంకా క్లారిటీ లేదు. హరిహర వీరమల్లు చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న క్రిష్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. కేవలం పవన్ కళ్యాణ్ సినిమా చేయడం వల్లే తన కెరీర్ లో కొన్ని సంవత్సరాలు నష్టపోయానని ఇప్పటికీ వీకెండ్ పాలిటిక్స్ చేస్తూ అటు పూర్తిగా రాజకీయాలు, ఇటు సినిమా షూటింగులు అంటూ రెండు పడవలపై కాళ్ళు వేసి దేనిపైనా దృష్టి పెట్టకుండా తన సినిమాలో నటించకుండా ఆలస్యం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తీరు తట్టుకోలేకే డైరెక్టర్ క్రిష్ హరిహర వీరమల్లు ప్రాజెక్టునుండి తప్పుకున్నాడని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.
మరోవైపు సెప్టెంబర్ 27న రిలీజ్ కావాల్సిన ‘ఓజి’ అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.కేవలం ఒకే ఒక్క గ్లింప్స్ తో హైప్ తెచ్చుకున్న ఈ మూవీకి ఓటిటి డీల్ ఇంకా పూర్తి కాలేదని అది పూర్తయితే తప్ప విడుదలయ్యే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. అంత పెద్ద పవర్ స్టార్ సినిమాకి ఓటిటి డీల్ కూడా ఫైనల్ కాలేదంటే పవన్ కళ్యాణ్ సినిమాపై నమ్మకం లేక ఎవరూ ముందుకు రావడం లేదా అనే ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తాను చేస్తున్న తప్పులను సరిద్దుకుని సినిమాలపై దృష్టి పెట్టకుంటే కనీసం తనతో సినిమా తీసే సాహసం ఏ నిర్మాత చేయకపోవచ్చు..