ఈ ఏడాది మలయాళ చిత్రాలకు కాలం కలిసి వచ్చినట్లుంది.. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కుతున్న మాలీవుడ్ చిత్రాలు వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పటికే ప్రేమలు 100 కోట్ల క్లబ్ లో చేరగా, ది గోట్ లైఫ్ 150 కోట్లు రాబట్టింది. మంజుమ్మల్ బాయ్స్ అయితే ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి మలయాళ చిత్రాల్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి సత్తా చాటింది. కేవలం 13 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఆవేశం రూ.100 కోట్ల క్లబ్లో చేరిన 7వ మాలీవుడ్ చిత్రంగా నిలవడం గమనార్హం.
ఈ ఏడాది రెండు 100 కోట్ల సినిమాల్లో ఫహాద్ ఫాజల్ భాగస్వామిగా ఉండటం విశేషం. ఇటీవలే పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్ల సినిమాగా నిలిచిన ప్రేమలు చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించిన ఫహాద్ ఫాజిల్ తాజాగా తాను నటించిన ఆవేశం చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్స్, ఫహాద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ నిర్మించిన ఈ చిత్రానికి జిత్తు మాధవన్ దర్శకత్వం వహించగా సుశీన్ శ్యామ్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం థియేటర్లలో స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తున్న ఈ చిత్రం మరిన్ని కలెక్షన్స్ కొల్లగొట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా ప్రస్తుతం పుష్ప 2 లో ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఫహాద్ ఫాజిల్ సూపర్ స్టార్ రజినీకాంత్ వెట్టయాన్ లో నటిస్తుండగా పుష్ప 2 పై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి.